తాడేపల్లికి చేరిన వైసీపీ రాజమండ్రి వంచాయితీ: సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరిన జక్కంపూడి, మార్గాని
రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు మంగళవారం నాడు అమరావతికి చేరుకొన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ ఇాద్దరితో వైవీ సుబ్బారెడ్డి భేటీ కానున్నారు. ఆ తర్వాత ఈ ఇద్దరు నేతలతో సీఎం జగన్ కూడ చర్చించే అవకాశం ఉందని సమాచారం.
అమరావతి: రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్(Rajahmundry MP Margani Bharat), రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల(Rajanagaram MLA Jakkampudi Raja) మధ్య సయోధ్య కోసం వైసీపీ నాయకత్వం చర్యలు చేపట్టింది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి మంగళవారం నాడు ఉదయం జక్కంపూడి రాజా, మార్గాని భరత్ లు చేరుకొన్నారు.ఈ ఇద్దరిని ఇవాళ అమరావతికి రావాలని వైసీపీ నాయకత్వం నిన్ననే సమాచారం పంపింది.
రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు పరస్పరం విమర్శలు చేసుకొన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ సెల్ఫీ దిగడాన్ని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీకి నష్టం చేసేలా మార్గాని భరత్ వ్యవహరిస్తున్నాడని ఆయన మండిపడ్డారు.
also read:హై కమాండ్ వద్దకు రాజమండ్రి పంచాయితీ: మార్గాని భరత్, జక్కంపూడి రాజాల మధ్య సర్ధుబాటు యత్నం
ఈ వ్యాఖ్యలకు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కూడా అదే స్థాయిలో కౌంటరిచ్చారు. పార్టీకి నష్టం చేసే విధంగా తాను ఏనాడూ వ్యవహరించలేదని ప్రకటించారు. పార్టీకి నష్టం చేసేలా ఎవరు వ్యవహరిస్తున్నారో తనకు తెలుసునన్నారు. కొంతకాలంగా ఈ ఇద్దరి మధ్య సఖ్యత లేదనే ప్రచారం పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది.ఇలా బహిరంగంగా విమర్శలు చేసుకోవడంతో ఈ వ్యవహారం తారాస్థాయికి చేరుకొందని వైసీపీ నాయకత్వం గుర్తించింది. ఈ ఇద్దరి మధ్య సర్ధుబాటు చేయాలని భావించింది.వైసీపీ తూర్పుగోదావరి జిల్లా ఇంచార్జీ వైవీ సుబ్బారెడ్డి మార్గాని భరత్, జక్కంపూడి రాజాలకు తాడేపల్లి రావాలని ఆదేశించారు. వీరిద్దరితో సుబ్బారెడ్డి తొలుత చర్చించనున్నారు. ఆ తర్వాత ఆ ఇద్దరు నేతలు సీఎం వద్దకు వెళ్లనున్నారు.