బంగాళాఖాతంలో ఏర్పడిన మైచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 140కి పైగా రైళ్లు రద్దు చేసినట్లు సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన మైచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 140కి పైగా రైళ్లు రద్దు చేసినట్లు సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. తుఫాను తీరం దాటనున్న నేపథ్యంలో డిసెంబర్ 3 నుంచి 6 వ తేదీ వరకు వివిధ రైళ్లను రద్దు చేస్తున్నామని, మరికొన్నింటినీ పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
ఇకపోతే.. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారిన నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ అప్రమత్తమయ్యారు. ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని ఆయన అలర్ట్ చేశారు. ‘‘మైచౌంగ్’’ తుఫాను ఈ నెల 4న నెల్లూరు - మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం వుండటంతో అధికారులంతా సన్నద్ధంగా వుండాలని జగన్ ఆదేశించారు. సహాయక చర్యల్లో ఎలాంటి లోటూ రాకూడదని, అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు తుఫాను ప్రభావిత జిల్లా కలెక్టర్లు సిద్ధంగా వుండాలని జగన్ ఆదేశించారు.
కరెంట్, రవాణా వ్యవస్థలకు అంతరాయం ఏర్పడితే వాటిని పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి తాగునీరు, ఆహారం, పాలు వంటివి అందుబాటులో వుంచుకోవాలని.. అలాగే వైద్య సేవలను కూడా అందజేపయాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు.
Also Read: cyclone michaung : రేపు తుపానుగా మారనున్న తీవ్రవాయుగుండం..ఏపీలో భారీ వర్షాలు..
కాగా.. మైచౌంగ్ తుఫాను కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తుండగా, ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రభావం కనిపిస్తోంది. తమిళనాడు, ఏపీల్లో తుఫాను సైరన్ మోగుతోంది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురంలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ఇప్పటికే చెన్నైలో అనేక ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. రోడ్లు జలమయం కావడంతో రోడ్డు రవాణాకు అంతరాయం ఏర్పడింది. రైల్వే ట్రాకులపై వరద పొటెత్తడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన మైచౌంగ్ తుఫాను కారణంగా డిసెంబర్ 3 నుంచి ఉత్తర తమిళనాడు తీరం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో వర్షాలు, గాలుల తీవ్రత పెరుగుతుందనీ, డిసెంబర్ 4 సాయంత్రానికి ఆ తీరాలను దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా బలపడి మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం మేనేజింగ్ డైరెక్టర్ సునంద తెలిపారు. వాయువ్య దిశలో కదులుతూ డిసెంబర్ 4 సాయంత్రానికి ఉత్తర తమిళనాడు తీరం, దక్షిణాంధ్ర తీరాన్ని తాకే అవకాశం ఉందనీ, అయితే డిసెంబర్ 3 నుంచి వర్షాలు, గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందన్నారు.
