సారాంశం

తుపాను ప్రభావంతో తీరంలో 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, నాలుగవ తేదీ సాయంత్రానికి చెన్నై మచిలీపట్నం మధ్య తుపాను తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరించింది.

అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం రేపటికి తుపానుగా మారనుంది. నెల్లూరు-మచిలీపట్నం మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ తుపాను నెల్లూరుకు 860 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 910 కిలోమీటర్ల  దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.కోస్తాంధ్ర, సీమ జిల్లాల్లో ఈ నెల నాలుగు నుంచి ఆరు వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. 

తీవ్ర తుపాను హెచ్చరికలతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఏపీ సిఎస్ జవహర్ రెడ్డితో సమీక్ష నిర్వహించారు. తుపాను వల్ల ఆస్తి, ప్రాణనష్టాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో సిఎస్ మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర జిల్లాస్థాయిలో కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేశామని తెలిపారు. తీరప్రాంత జిల్లాల కలెక్టర్లను తుపాను విషయంలో అప్రమత్తం చేసినట్లుగా తెలిపారు. 

Top Stories : సాగర్ పై కేంద్ర బలగాలు, ‘కాప్ 33’ భారత్ లో.. ఈసారీ అధికారం మనదే.. ముంచుకొస్తున్న మిచాంగ్..

 ఈ తుపాను ప్రభావంతో వచ్చే రెండు,మూడు రోజుల్లో కోస్తాంధ్ర జిల్లాలతో పాటు గోదావరి, రాయలసీమ జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను ప్రభావంతో తీరంలో 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, నాలుగవ తేదీ సాయంత్రానికి చెన్నై మచిలీపట్నం మధ్య తుపాను తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరించింది.

తుపాను నేపథ్యంలో మత్స్యకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఎన్డీఆర్ఎఫ్, ఎన్జిఆర్ బృందాలను సన్నద్ధం చేశారు.తూర్పు నౌకాదళ కమాండ్.. నౌకలను, అత్యవసర సామాగ్రిని సిద్ధంగా ఉంచింది.. తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే జిల్లాలకు నిత్యవసర సరుకులను కూడా పౌరసరఫరాల విభాగం ద్వారా అందించేలా చర్యలు తీసుకుంది.