తిరుపతి: పుల్వామా ఉగ్రవాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ వ్యవహరించిన తీరు చాలా బాధాకరమన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. 40 మంది జవాన్లు ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోతే మోదీ స్పందించలేదన్నారు. 

ఒక సినిమా షూటింగ్ లో ఉన్న మోదీకి ఉగ్రవాద దాడి గురించి తెలిసినా కనీసం పట్టించు కోలేదన్నారు. నవ్వుతూ సినిమా షూటింగ్ చేశారంటూ ధ్వజమెత్తారు. మానవత్వమున్న వ్యక్తిగా ప్రతీ పౌరుడు చలించిపోతే  మోదీలో మాత్రం ఏ కదలిక లేదన్నారు. 

జవాన్లపై ఉగ్రవాద దాడిని దేశమంతా ఖండిస్తున్నా మోదీ మాత్రం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారని అలాంటి వ్యక్తి ప్రధానిగా ఉండటం బాధాకరమన్నారు రాహుల్ గాంధీ. దాడి జరిగిన మూడున్నర గంటల అనంతరం మోదీ ఉగ్రవాద దాడిపై స్పందించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. 

ఆ తర్వాత బాధితుల కుటుంబాలను పరామర్శిస్తున్నట్లు ఫోటోలకు ఫోజులిచ్చారని ధ్వజమెత్తారు. మానవత్వం లేని మనిషి ప్రధానిగా ఉండటం మన దౌర్భాగ్యం అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.