ప్రత్యేకహోదా, రైల్వేజోన్ వల్ల రాష్ట్రానికి ఆర్ధికంగా, పారిశ్రామికంగా ఎంతో లాభం. అసెంబ్లీ సీట్ల పెంపు వల్ల ఆర్ధికంగా చాలా భారం. ఈ విషయాలనే రాహూల్ చెబుతుంటే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా చంద్రబాబు ఏమాట్లాడలేకున్నారు.
అసెంబ్లీ సీట్ల పెంపు విషయమై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధి రూపంలో చంద్రబాబునాయుడుకు పెద్ద షాక్ తగిలింది. వచ్చే ఎన్నికల్లోగా అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచుకుని ఇబ్బందుల్లో నుండి బయటపడదామని చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, కేంద్రం పెద్దగా పట్టించుకోవటం లేదనుకోండి అది వేరే సంగతి.
మామూలుగా అయితే, చంద్రబాబు ప్రతీ డిమాండ్ ను వెంకయ్యే మోస్తుంటారు కేంద్రంలో. కానీ సీట్లపెంపు విషయంలో మాత్రం వెంకయ్య చేతులెత్తేసారు. ఎందుకంటే రాష్ట్ర భాజపాలోని చంద్రబాబు వ్యతిరేక వర్గం ఇటు చంద్రబాబు అటు వెంకయ్యలపై ఏకకాలంలో జాతీయ నాయకత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేసింది. అసలే, వెంకయ్య వైఖరిపై మంటగా ఉన్న అమిత్ షా వెంటనే మోడితో ఇదే విషయాన్ని చేరవేసారట. దాంతో మోడి కూడా వెంకయ్యను కాస్త దూరం పెట్టటమే కాకుండా రాష్ట్ర వ్యవహారాల్లో వేలు పెట్టొద్దని చెప్పారట. దాంతో వెంకయ్య జోరుకు బ్రేకులు పడ్డాయి.
అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో చంద్రబాబు మహా పట్టుదలగా ఉన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించటం ద్వారా జగన్ను ఇబ్బందులు పెడదామని చంద్రబాబు అనుకున్నారు. అయితే, ఫిరాయింపులు ఎక్కువైపోయి చంద్రబాబే ఇబ్బందుల్లో పడ్డారు. వైసీపీ నుండి 21 మంది ఎంఎల్ఏలను లాక్కున్న చంద్రబాబు ఆ మేరకు వారితో పాటు టిడిపిలోని సీనియర్లకు కూడా నియోజకవర్గాలు చూపించాలి. లేకపోతే చంద్రబాబుకు చుక్కలు కనబడటం ఖాయం. ఎందుకంటే, 21 నియోజకవర్గాల్లో ఫిరాయింపు ఎంఎల్ఏలకు, పార్టీ సీనియర్ నేతలకు బాగా గొడవలవుతున్నాయి. అందరికీ పోటీ చేసే అవకాశం రావాలంటే అసెంబ్లీ సీట్లు పెంచుకోవటమొక్కటే మార్గం. అందుకే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
సరిగ్గా అదే సమయంలో కాంగ్రెస్ యువరాజు రాహూల్ గాంధి చంద్రబాబు ప్రయత్నాలకు అడ్డుపడుతున్నారు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేకహోదా, విశాఖపట్నం ప్రత్యేక రైల్వేజోన్ తర్వాతే అసెంబ్లీ సీట్ల పెంపు జరగాలని డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో రాజ్యసభలో బిల్లు ఓడించటమే కాకుండా లోక్ సభలో కూడా ప్రతిపక్షాలన్నింటినీ కూడగడతామని గట్టిగా వార్నింగ్ ఇవ్వటంతో చంద్రబాబుకు దిక్కుతోచటం లేదు.
ప్రత్యేకహోదా, రైల్వేజోన్ వల్ల రాష్ట్రానికి ఆర్ధికంగా, పారిశ్రామికంగా ఎంతో లాభం. అసెంబ్లీ సీట్ల పెంపు వల్ల ఆర్ధికంగా చాలా భారం. ఈ విషయాలనే రాహూల్ చెబుతుంటే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా చంద్రబాబు ఏమాట్లాడలేకున్నారు.
