Asianet News TeluguAsianet News Telugu

ఏపీ రాజధాని, పార్టీతో పొత్తు: వైఎస్ జగన్ కు రాహుల్ గాంధీ షాక్

ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలు కార్పొరేషన్‌ల మాదిరిగా ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఏపీ కాంగ్రెస్ ఎదగడానికి చాలా ఆస్కారం ఉందని చెప్పారు. 

Rahul Gandhi comments on YSRCP And TDP in Press Meet at Adoni In Kurnool District
Author
First Published Oct 19, 2022, 2:18 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలు కార్పొరేషన్‌ల మాదిరిగా ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఏపీ కాంగ్రెస్ ఎదగడానికి చాలా ఆస్కారం ఉందని చెప్పారు. రైతులు, కూలీలు, పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోనిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత్ జోడో యాత్రకు  ఏపీలోలో అద్భుతమైన స్పందన లభించిందని అన్నారు. తమకు అందుతున్న మద్దతు తమ నాయకుల అంచనాలకు మించి ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ నిర్మాణానికి ఇది శుభారంభం అని పేర్కొన్నారు. 

ఏపీ విభజనకు సంబంధించినంతవరకు.. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు కొన్ని కమిటిమెంట్స్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. తాము ఆ హామీలను తప్పకుండా నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఏపీ రాజధాని విషయంలో, పార్టీలతో పొత్తుల విషయంలో కూడా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఏపీకి అమరావతే రాజధాని..
ఆంధ్రప్రదేశ్‌కు ఒకటే రాజధాని ఉండాలనేది కాంగ్రెస్ అభిప్రాయమని రాహుల్ గాంధీ చెప్పారు. మూడు రాజధానులను కలిగి ఉండాలనే ఆలోచన సరైన మార్గం అని తాము భావించడం లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ఒకే రాజధాని ఉండాలని.. అది అమరావతిగా ఉండాలని భావిస్తున్నామని చెప్పారు. ఇది తమ వైఖరి అని స్పష్టం చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన వారిని తాను కలిశానని గుర్తుచేశారు. వారిని తాము అండగా ఉంటామని.. వారి హక్కులను కాపాడుతూనే ఉంటామని చెప్పారు. తాము అధికారంలో వస్తే అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని.. పోలవరం ప్రాజెక్టు పూర్తి  చేస్తామని హామీ ఇచ్చారు. 

గతంలో జరిగిన విషయాల గురించి కాకుండా.. భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలని చెప్పారు. రాయలసీమ స్పెషల్ ప్యాకేజ్‌‌ అంశంపై స్పందించిన రాహుల్ గాంధీ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారత ప్రభుత్వం ఇచ్చిన హామీలకు తాము కట్టుబడి ఉన్నామని మరోమారు స్పష్టం చేశారు. అందులో రాయలసీమ స్పెషల్ ప్యాకేజ్ కూడా ఉందన్నారు. 

వైసీపీ మద్దతు తీసుకోవడంపై..
అదే సమయంలో ఏపీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పొత్తులపై అడిగిన ప్రశ్నలపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ఆ నిర్ణయం తన పరిధిలో కాదని చెప్పారు. రేపు అవసరమైతే కేంద్రంలో వైసీపీ మద్దతు తీసుకుంటారా? అనే ప్రశ్నపై స్పందించిన రాహుల్.. వాటిపై కాంగ్రెస్ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎలా ఎందుకు ముందుకెళ్లాలో.. పార్టీలో తన రోల్ ఏమిటనేది పార్టీ అధ్యక్షుడు చెబుతారని అన్నారు. 

బీజేపీ, వైసీపీ, టీడీపీలలో అసమ్మతిని బహిరంగంగా వ్యక్తం చేయగలరా? అని ప్రశ్నించారు. ఈ పార్టీల్లో అసమ్మతిని సహించరని విమర్శించారు. కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరిస్తుందని.. తమది ఓపెన్ మైండెడ్ పార్టీ అని పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ అంతర్గత ఎన్నికలను మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తున్నారని మీడియాను ప్రశ్నించారు. బీజేపీ, ఇతర ప్రాంతీయ పార్టీల అంతర్గత ఎన్నికలపై ఎవరూ ఎందుకు ఆసక్తి చూపరని అడిగారు. 

ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలనే ప్రశ్నకు సమాధానమిచ్చిన రాహుల్ గాంధీ.. ‘‘కాంగ్రెస్ ప్రతి భారతీయుడికి ప్రాతినిధ్యం వహిస్తుంది. పేద ప్రజలు, రైతులు, కార్మికుల హక్కులను కాపాడే పార్టీ మాది. దేశంలో సామరస్యాన్ని ఎలా తీసుకురావాలో మాకు అర్థమైంది. అందరి వాణిని వినే సంస్కృతి మాది’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. జర్నలిస్టులను ఎదుర్కొనే ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. మేము స్వేచ్ఛా చర్చను విశ్వసిస్తామని చెప్పారు. జర్నలిస్టుల ప్రశ్నలకు తాము భయపడమని చెప్పారు. బీజేపీ భయపడుతోందని..  నిజాన్ని ఎదుర్కోవడం వారికి ఇష్టం లేదని విమర్శించారు. ప్రధాని మోదీ ఇలాంటి మీడియా సమావేశాలు నిర్వహించడం చూశారా అని ప్రశ్నించారు. 

భారతదేశంలో ద్వేషం, హింస వ్యాప్తి చెందుతోందని.. భారతదేశం విభజించబడుతుందని తాము స్పష్టంగా చెప్పామని అన్నారు. తాము దీనికి వ్యతిరేకమని పేర్కొన్న రాహుల్ గాంధీ.. భారతదేశాన్ని అనుసంధానం చేయడమే లక్ష్యంగా భారత్ జోడో యాత్ర సాగుతుందని తెలిపారు. ఈ ప్రయాణం ద్వారా ప్రజలను కనెక్ట్ అయ్యే అవకాశాన్ని పొందుతున్నామని చెప్పారు.  ఈ యాత్ర ద్వారా ప్రయోజనాన్ని పొందుతున్నామని.. అలాగే ఎంతో నేర్చుకుంటున్నామని చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios