Asianet News TeluguAsianet News Telugu

ప్రత్యేక హోదా కేంద్ర బహుమతి కాదు....ఏపీకి ప్రధాని తీర్చాల్సిన బాకీ: రాహుల్ గాంధీ

 ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కేంద్రం ఇచ్చే బహుమతి కాదని ప్రధాని ఆంధ్రప్రదేశ్ తీర్చాల్సిన బాకీ అన్నారు. కర్నూలు జిల్లాలో పర్యటించిన రాహుల్ గాంధీ ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జరిగిన సత్యమేవ జయతే సభలో ముఖ్యఅతిథిగా రాహుల్ గాంధీ పాల్గొన్నారు.  

Rahul gandhi comments on bjp
Author
Kurnool, First Published Sep 18, 2018, 5:13 PM IST

కర్నూలు: ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కేంద్రం ఇచ్చే బహుమతి కాదని ప్రధాని ఆంధ్రప్రదేశ్ తీర్చాల్సిన బాకీ అన్నారు. కర్నూలు జిల్లాలో పర్యటించిన రాహుల్ గాంధీ ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జరిగిన సత్యమేవ జయతే సభలో ముఖ్యఅతిథిగా రాహుల్ గాంధీ పాల్గొన్నారు.  

ఆంధ్రప్రదేశ్‌తో కాంగ్రెస్‌కు చారిత్రక సంబంధం ఉందన్న రాహుల్ గాంధీ దేశానికి దిశా నిర్దేశం చేసింది ఆంధ్రప్రదేశ్ అని గుర్తు చేశారు. ఏపీ నుంచి వచ్చిన నేతలు దేశానికి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. దళిత నేత దామోదరం సంజీవయ్యను సీఎం చేసిన ఘనత నెహ్రూదన్నారు. 

సంజీవయ్య అవినీతిపరుడని కొందరు నెహ్రూకు ఫిర్యాదు చేశారని వెల్లడించారు. నెహ్రూ ఓ బృందాన్ని సంజీవయ్య ఇంటికి పంపి వాస్తవాలు తెలుసుకున్నారని, సంజీవయ్యపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని తేలిందన్నారు. వారం రోజుల్లో సంజీవయ్యను నెహ్రూ సీఎం చేసిన విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. 

మరోవైపు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆనాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్ ఆలోచించారని తెలిపారు. అందుకే ఏపీకి 5ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని మన్మోహన్‌ రాజ్యసభలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. 

కాంగ్రెస్ ఐదేళ్లు హోదా ఇస్తామంటే బీజేపీ నేతలు పదేళ్లు ఇవ్వాలన్నారని తెలిపారు. కానీ అధికారంలోకి రాగానే హోదాపై బీజేపీ మాట తప్పిందని ధ్వజమెత్తారు. ఆనాడు చట్టం ద్వారా ఏపీకి కావాల్సినవన్నీ ఇచ్చామన్నారు. మన్మోహన్‌ ఇచ్చిన హామీల అమలుకు బీజేపీ ప్రభుత్వం ఒక్క చర్య తీసుకోలేదని మండిపడ్డారు.
 
పోలవరం, కడప ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ రైల్వేజోన్‌, మెట్రోరైలు, అంతర్జాతీయ విమానాశ్రయం ఇచ్చామని రాహుల్ గాంధీ తెలిపారు. 12 జాతీయ విద్యాసంస్థలను మంజూరు చేశామని వివరించారు. నీటి వివాదాలు రాకుండా కృష్ణా, గోదావరి ట్రిబ్యునల్స్‌ ఏర్పాటు చేశామన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ఏపీకి ప్రయోజనాలన్నీప్రకటిస్తే వాటిని అమలు చెయ్యకుండా బీజేపీ మోసం చేసిందని రాహుల్ ధ్వజమెత్తారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios