Asianet News TeluguAsianet News Telugu

టీడీపితో పొత్తు పొడుపుపైనే రఘువీరా ఆశలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలతోపాటు జనసేన, ఇతర పార్టీలు గెలుపు గుర్రాలపై దృష్టి సారించారు. ఎవరు ఎక్కడి నుంచి బరిలోకి దిగితే విజయం సాధిస్తారు అన్నదానిపై కసరత్తు ప్రారంభించాయి. 

raghuveera waiting for alliance with TDP
Author
Ananthapuram, First Published Jan 19, 2019, 4:04 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలతోపాటు జనసేన, ఇతర పార్టీలు గెలుపు గుర్రాలపై దృష్టి సారించారు. ఎవరు ఎక్కడి నుంచి బరిలోకి దిగితే విజయం సాధిస్తారు అన్నదానిపై కసరత్తు ప్రారంభించాయి. 

సర్వేలపై సర్వేలు చేస్తూ గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇచ్చేలా ఎన్నికల బరిని సిద్ధం చేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రచారానికి ఎక్కువ సమయం కేటాయించింది. ఫలితంగా ఆ పార్టీ విజయదుందుభి మోగించింది. 

టీఆర్ఎస్ ప్లాన్ నే ఏపీలోనూ అమలు చెయ్యాలని అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ఇకపోతే ఆయా పార్టీల అధినేతలు సైతం సొంత నియోజకవర్గాలను ఎంచేసుకుని అప్పుడే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేశారు. 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవలే కుప్పం నియోజకవర్గంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ఎన్నికల ప్రచారంలా నిర్వహించారు. భారీ జనసమీకరణతో తెగ హామీలు ఇచ్చేశారు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ ప్రజలను కోరారు. తాను ఎంత ఎదిగినా అందుకు కుప్పం నియోజకవర్గ ప్రజల ఆదరణే కారణమంటూ చెప్పుకొచ్చారు. 

ఇకపోతే అటు వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం తన సొంత నియోజకవర్గం అయిన పులివెందులపై ప్రత్యేక దృష్టి సారించారు. పాదయాత్ర అనంతరం 14 నెలల విరామం తర్వాత కడప జిల్లా చేరుకున్న వైఎస్ జగన్ మూడు రోజులపాటు పులివెందులలోనే తిష్ట వేశారు. 

అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఎక్కడ నుంచి పోటీ చేస్తారా అన్నది అనుమానంగా ఉంది. ఆయన గతంలో అసెంబ్లీకి ఎన్నికై పలు మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. అయితే ఈసారి ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తారా..లేక పార్లమెంట్ కు పోటీ చేస్తారా అసలు పోటీ చేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. 

ఇటీవలే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసిన రఘువీరారెడ్డి తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకపోతే ఈ అభ్యర్థులను ప్రకటించాలంటూ 125 మంది అసెంబ్లీ అభ్యర్ధుల జాబితా 17 మంది పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను అందజేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పొత్తుపై ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో అభ్యర్థుల ప్రకటన కాస్త ఆలస్యం అయ్యేలా ఉంది. 

గత ఎన్నికల్లో రాష్ట్ర విభజన పుణ్యమా అంటూ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల్లంతైంది. దాదాపు అత్యధిక స్థానాల్లో డిపాజిట్లుకు సైతం నోచుకోకుండా పోయింది. అయితే  కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని యోచిస్తోంది. 

గత నాలుగున్నరేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం అవిశ్రాంత పోరాటం చేస్తున్న పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న ప్రశ్నఅనంతపురం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రఘువీరారెడ్డి ఇప్పటికే కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని ప్రకటించారు. 

గతంలో ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేసి గెలుపొందడంతోపాటు దివంగత సీఎం వైఎస్ కేబినేట్ లో స్థానం కూడా సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు రఘువీరారెడ్డి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేపడుతూ ముందుకు దూసుకుపోతున్నారు.  

కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేసుకుంటున్న ఆయనకు బ్రేక్ వేసే ప్రయత్నం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీలో కాంగ్రెస్, టీడీపీల మధ్య పొత్తు ఉంటే రఘువీరారెడ్డిని హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చెయ్యించాలని భావించారు.

అక్కడ నుంచి పోటీ చేయిస్తే ఏడు నియోజకవర్గాలను రఘువీరా కవర్ చెయ్యడంతోపాటు అసెంబ్లీ స్థానాలు సర్దుబాటు చేసుకోవచ్చని ప్లాన్ వేశారు. దీంతో రఘువీరారెడ్డి సైతం గందరగోళానికి గురయ్యారు. తాను అసెంబ్లీకి పోటీ చేస్తానంటే బాబు పార్లమెంట్ అంటున్నాడేంటంటూ అసహనం వ్యక్తం చేశారు. 

అయితే ఏపీలో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు లేనట్లేనని ప్రచారం వస్తున్న నేపథ్యంలో రఘువీరారెడ్డి కళ్యాణ దుర్గంపై మళ్లీ దృష్టి సారించారు. అయితే పొత్తుపై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో పూర్తి స్థాయిలో కళ్యాణ దుర్గంపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారట. మరిపొత్తులపై పొద్దు ఎప్పుడు పొడుస్తుందోనని రఘువీరా ఆశగా ఎదురుచూస్తున్నారట.

Follow Us:
Download App:
  • android
  • ios