హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీపై ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి నిప్పులు చెరిగారు. ఏ మొహం పెట్టుకుని మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మోడీ రేపు (ఆదివారం) ఎపి పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనపై ఆయన స్పందించారు. 

మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలియజేయనున్నట్లు రఘువీరా తెలిపారు. మోడీ పర్యటనను తాము అడ్డుకోబోమని, అది సంస్కృతి కాదని ఆయన అన్నారు. రేపటి రోజును బ్లాక్ డేగా పాటిస్తామని, ఇందులో తమతో అన్ని పార్టీలు కలిసి రావాలని ఆయన అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మోడీ కుమ్మక్కయ్యారని, జగన్ పార్టీ సాయంతోనే మోడీ మీటింగ్ పెడుతున్నారని ఆయన అన్నారు. విభజన హామీలు అమలు చేయడంలో మోడీ విఫలమయ్యారని ఆయన విమర్శించారు. 

సిడబ్ల్యుసి సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టాలని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీని కోరినట్లు ఆయన తెలిపారు. ఎన్నికలకు ముందు, తర్వాత సిడబ్ల్యుసి సమావేశాలు జరుగుతాయని ఆయన చెప్పారు మార్చి మొదటివారం వరకు రాహుల్ రాష్ట్రంలో పర్యటిస్తారని ఆయన చెప్పారు.