Asianet News Telugu

రఘురామ లేఖాస్త్రాలు : సీఎం జగన్ కు ఐదో లెటర్.. ఈ సారి అగ్రిగోల్డ్ బాధితులపై...

ఎంపీ రఘురామ కృష్ణంరాజు జగన్ కు సంధిస్తున్న లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. ఈ సారి అగ్రిగోల్డ్ బాధితులను వెంటనే ఆదుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా రూ. 11 వందల కోట్లను తక్షణమే విడుదల చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. 

raghuramakrishnam raju 5th letter to cm ys jagan - bsb
Author
Hyderabad, First Published Jun 14, 2021, 10:49 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఎంపీ రఘురామ కృష్ణంరాజు జగన్ కు సంధిస్తున్న లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. ఈ సారి అగ్రిగోల్డ్ బాధితులను వెంటనే ఆదుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా రూ. 11 వందల కోట్లను తక్షణమే విడుదల చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. 

హై కోర్టు ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేయాలని రఘురామ కోరారు. ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన.. నెరవేరని హామీలను రఘురామ లేఖల ద్వారా గుర్తు చేస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు లేఖలు రాశారు. సోమవారం అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి ఐదో లేఖను సంధించారు. 

కాగా, వైసీపి తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణం రాజు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలంటూ జగన్ కు లేఖలు సంధిస్తూ వస్తున్నారు. శుక్రవారం ఆయన వృద్ధాప్య పింఛన్లపై జగన్ కు లేఖ రాశారు. శనివారంనాడు పెళ్లి కానుక, షాదీ ముబారక్ పథకాలపై లేఖను సంధించారు. 

అధికారంలోకి వస్తే పెళ్లి కానుక సాయం పెంచుతామని వైసీపీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఆ సాయాన్ని లక్ష రూపాయలకు పెంచుతామని ప్రకటించిందని చెప్పారు. పెళ్లి కానుక సాయం పెంపుపై ప్రజల నుంచి ఎన్నికల్లో మద్దతు లభించిందని, అందువల్ల ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు.  ఏపీలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని ఆయన జగన్ ను కోరారు. 

అటు కేంద్రమంత్రులు, లోక్‌సభ స్పీకర్, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఎంపీలకు రఘురామ వరుసపెట్టి లేఖలు రాస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తనపై అక్రమ కేసులు పెట్టారని, సీఐడీ కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ జాతీయ స్థాయిలో మద్ధతు కూడగడుతున్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాల్సిందిగా పిటిషన్ వేసినందుకే తనను టార్గెట్ చేశారంటూ ఆ లేఖల్లో పేర్కొంటున్నారు. 

వైసీపీ వెబ్‌సైట్ ఎంపీల లిస్ట్‌‌లో రఘురామ పేరు తొలగింపు.. రెబల్ నేతకు జగన్ ఝులక్...

ఏపీ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చాల‌ని కోరుతూ ఆదివారం కూడా సీఎం జగన్‌కు రఘురామ లేఖ రాశారు. ఉద్యోగాల భ‌ర్తీ క్యాలెండ‌ర్ విడుద‌ల హామీ నెర‌వేర‌లేద‌ని.. ఏటా జ‌న‌వ‌రిలో ఉద్యోగాల భర్తీ క్యాలెండ‌ర్ ఉంటుంద‌ని ఎన్నికల మేనిఫెస్టోలో వైకాపా హామీ ఇచ్చిన‌ట్లు ఆయన పేర్కొన్నారు. ఈ హామీతో ఎన్నిక‌ల స‌మ‌యంలో నిరుద్యోగుల నుంచి మ‌ద్ద‌తు ల‌భించింద‌ని రఘురామ గుర్తుచేశారు. ఉగాదికి నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌న్న ఆశ‌తో నిరుద్యోగులు ఎదురు చూశార‌ని ఆయన చెప్పారు. ఏపీ ప్ర‌భుత్వం వెంట‌నే ఉద్యోగాల భ‌ర్తీకి వార్షిక క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించాల‌ని రఘురామ ఆ లేఖ‌లో కోరారు.

గ్రామ స‌చివాల‌యాల్లో 8,402 పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని, ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌లో 6,100 పోస్టులు, 18 వేల ఉపాధ్యాయ, 6 వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు రిక్రూట్‌మెంట్‌కు సిద్ధంగా ఉన్నాయ‌ని వెల్లడించారు. కొన్నేళ్ల నుంచి ఉద్యోగాల భ‌ర్తీ చేయ‌కుండా పక్కనపెట్టేశారని.. వంద‌ల సంఖ్య‌లో సెక్ర‌టేరియ‌ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని రఘురామ స్పష్టం చేశారు. మూడు వేల పోస్టుల కోసం 2018-19లో ఏపీపీఎస్సీ నోటిఫికేష‌న్ ఇచ్చింద‌ని.. కోర్టులో కేసుల కార‌ణంగా అంతంత మాత్ర‌మే భ‌ర్తీ అయ్యాయ‌ని చెప్పారు. ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా మెగా డీఎస్సీ తీసుకొస్తామ‌ని సీఎం జగన్‌ ప్ర‌క‌టించార‌ని ఆయ‌న గుర్తు చేశారు. ప్ర‌తి కుటుంబానికి ప్ర‌భుత్వ ఉద్యోగం హామీని ఇప్ప‌టికీ నెరవేర్చ‌లేద‌ని రఘురామ ఎద్దేవా చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios