ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చెయ్యాలని సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ మీద 11 చార్జ్ షీట్ లను సీబీఐ నమోదు చేసిందని పిటిషన్ లో పేర్కొన్నారు. 

ప్రతి చార్జ్ షీట్ లో జగన్ ఏ-1గా ఉన్నారని పిటిషనర్ పేర్కొన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా తమ పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఉండాలని పిటీషన్ వేసినట్టు రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. 

జగన్ పై నమోదైన కేసులను త్వరగతిన విచారణ పూర్తి చేయాలని పిటీషనర్ కోరారు. నేడు సీబీఐ కోర్టులో ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. 

‘అదో దిక్కుమాలిన దౌర్భాగ్యపు దగుల్భాజీ ట్వీట్’.. : విజయ్ సాయి పై రఘురామకృష్ణరాజు ఫైర్...

ఇదిలా ఉండగా బుధవారం వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ్ సాయి రెడ్డి మీద ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా విజయసాయి వివాదాస్పద ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. 

దీనిపై స్పందించిన రఘురామ కృష్ణరాజు దిక్కుమాలిన దౌర్భాగ్యపు దగుల్భాజీ ట్వీట్ గా దాన్ని అభివర్ణించాడు. ప్రత్యర్థిని అయినా గౌరవించాలని రామాయణం చెబుతోందని, చిన్నప్పటి నుంచి అలాంటి గ్రంథాలు చదువుకుంటే మర్యాద లక్షణాలు వచ్చేవేమో అని వ్యాఖ్యానించారు. 

‘నిన్న మీరు చేసిన దరిద్ర ట్వీట్ వలన పార్టీ పరువు పోయింది. పార్టీ ఇమేజ్ పోయింది. జాతీయ కార్యదర్శివి, రాజ్యసబలో సభ్యుడివి.. మా అందరికీ పార్లమెంటులో నాయకుడివి. అసలు బుద్దుందా.. అలా మాట్లాడతాడేంటి.. ఇదా సంస్కారం’ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.