Asianet News Telugu

ఆ గోతులు దాటితేనే రాజుగారి ఇళ్లు... కనుక్కోవడం ఎలాగంటే: జగన్ కు రఘురామ మరో లేఖ

ఇప్పటికే నవ హామీలు - వైఫల్యాలు పేరుతో తొమ్మిది లేఖలు రాసిన రఘురామ ఆ తర్వాత నవ ప్రభుత్వ కర్తవ్యాలు పేరుతో మరికొన్ని లేఖాస్త్రాలు సంధించారు. ఇప్పుడు నవ సూచనల పేరిట లేఖలు రాస్తున్నారు. 

raghurama krishnamraju writes a letter to cm ys jagan akp
Author
Amaravati, First Published Jul 16, 2021, 9:55 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూడిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖల పరంపర కొనసాగుతోంది. జగన్ కు తాను విధేయుడినని పేర్కొంటూనే ప్రభుత్వం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలను ఎండగడుతూ వున్నారు రఘురామ. ఇలా కొద్దిరోజులుగా సీఎం జగన్ కు వరుస లేఖలు రాస్తూ ప్రభుత్వ విధానాలను తప్పుబడుతున్నారు. ఇలా ఇప్పటికే నవ హామీలు - వైఫల్యాలు పేరుతో తొమ్మిది లేఖలు రాసిన రఘురామ ఆ తర్వాత నవ ప్రభుత్వ కర్తవ్యాలు పేరుతో మరికొన్ని లేఖాస్త్రాలు సంధించారు. ఇప్పుడు నవ సూచనలపేరిట లేఖలు రాస్తున్నారు. తాజాగా శుక్రవారం రాష్ట్రంలో అధ్వానంగా మారిన రోడ్ల గురించి వివరిస్తూ మరో లేఖ రాశారు రఘురామ.   

సీఎం జగన్ కు రఘురామ రాసిన లేఖ యధావిధిగా: 

జులై 16, 2021
శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి,
ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

విషయం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారులు – వాస్తవ పరిస్థితి

సూచిక: నవ సూచనలు (విధేయతతో) లేఖ 9

ముఖ్యమంత్రి గారూ,
ప్రాంతం: పశ్చిమగోదావరి
ఏవండీ… రాజుగారి ఇంటి అడ్రస్ కాస్త చెబుతారా?
తమ్ముడూ… ఇక్కడ నుండి నాలుగు గోతులు దాటాక కుడివైపు తిరుగు… మరలా ఓ పది గోతులు దాటాక ఒక పెద్ద గొయ్యి కనపడుతుంది. అక్కడ ప్యాంటు పైకి లాక్కుని ఆ గొయ్యి దాటు. అక్కడ నుండి ఎడమ వైపు తిరుగు… మరలా ఆరు గోతులు దాటాక ఒక కరెంటు స్తంభం ఉంటుంది. ఆ పక్కనే ఆయన ఇల్లు… కరెంటు స్తంభం ముట్టుకోకు… స్తంభం నుంచి కరెంటు పాస్ అవుతుంది… షాక్ కొడుతుంది.
ఇదీ స్థూలంగా రోడ్ల పరిస్థితి. ఒక్క నా జిల్లాలోనే కాదు… రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ రహదారుల పరిస్థితి ఇలానే ఉంది.

దేశంలోని మొత్తం రోడ్ల పొడవులో మన రాష్ట్రంలోని హైవేల శాతం 5.46. రహదారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1,000 కోట్లు అందిస్తుంది. అంతర్ రాష్ట్ర రహదారులకు 100 శాతం గ్రాంట్ ఇస్తుంది. ఆర్ధిక ప్రాముఖ్యత ఉన్న రోడ్డు ప్రాజెక్టులకు 50 శాతం గ్రాంట్ అందచేస్తుంది. రాష్ట్రంలో ఉన్న 8,763 కి.మి రోడ్ల కోసం విడుదల అవుతున్న నిధులను చూసినా, రోడ్ల అభివృద్ధి కోసం వాహనదారుల నుంచి వసూలు చేస్తున్న టోల్ గేట్ సెస్ చూసినా ప్రజలు అవాక్కవుతున్నారు. దారుణంగా ఉన్న రోడ్డు పరిస్థితిని చూసి వారు ఆందోళన చెందుతున్నారు.

అత్యంత ఎక్కువ రద్దీ ఉన్న అన్ని రాష్ట్ర రహదారులపైనా వాహనదారుల నుంచి ఏపి స్టేట్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫీజును వసూలు చేస్తున్నారు. ఈ నిధులతో రోడ్లను అభివృద్ధి పరచాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యం. మొదట్లో రాష్ట్రంలోని 35 రహదారులపై టోల్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించినా ఇప్పుడు మరో 24 రాష్ట్ర రహదారులను ఆ జాబితాలో చేర్చి టోల్ ఫీజు వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచన చేస్తున్నది. దీనిపై వాహనదారుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతున్నది. నిర్ణీత కాలపరిమితిలో మరమ్మత్తులు చేయని కారణంగా దాదాపు అన్ని రాష్ట్ర రహదారుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. మరమ్మతులు చేయకుండా టోల్ ఫీజు వసూలు చేయడాన్ని వాహనదారులు నిశితంగా విమర్శిస్తున్నారు.

ప్రతి లీటరు పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ నుంచి ఒక రూపాయి రోడ్డు సెస్ రూపంలో ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు అందుతున్నది. ఈ మొత్తం ఏడాదికి రూ.500 కోట్లు అవుతున్నది. అయితే ఈ కార్పొరేషన్ నుంచి వీసమెత్తు పని కూడా జరగడం లేదు.

ప్రయాణం సుఖవంతంగా సాగాలి కానీ, దూరం భారంగా మారిపోకూడదు. ప్రస్తుత వర్షాకాలం సీజన్ లో రోడ్ల పరిస్థితి అత్యంత హీనంగా ఉన్న కారణంగా రాష్ట్ర రహదారుల శాఖ కు చెందిన ఒక అధికారి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటం మన రాష్ట్రంలో రోడ్డు నిర్వహణ వైఫల్యానికి గుర్తుగా మిగిలిపోతుంది. రాష్ట్రంలో నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు తోడు నైపుణ్యంలేని కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం వల్ల పరిస్థితి రోజు రోజుకూ మరింత దారుణంగా మారిపోతున్నది. సకాలంలో సరైన బిల్లులు చెల్లించని వ్యవస్థ ఉండటంతో నాణ్యమైన పనులు చేసే ప్రధమ శ్రేణి కాంట్రాక్టర్లు మన రోడ్డు ప్రాజెక్టులను స్వీకరించేందుకు ముందుకు రావడం లేదు. ఈ కారణంగా కోస్తా తీర ప్రాంతాలలోని అన్ని రోడ్లూ కొట్టుకుపోయి యమకూపాలుగా మారిపోయాయి. రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నిధుల్లో దాదాపుగా రూ.3000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తన ఇతర సంక్షేమ పథకాల కోసం దారి మళ్లించినట్లుగా కూడా చెబుతున్నారు. 

మీరు నా నియోజకవర్గం నుంచి నన్ను దూరంగా ఉంచేందుకు నిరంతరాయంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా కూడా నేను నా నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో జరుగుతున్న అన్ని వ్యవహారాలతోనూ సంబంధాలు కలిగే ఉన్నాను. రోడ్ల మరమ్మతు చేయకపోవడం వల్ల కోస్తా తీర ప్రాంతంలోని అన్ని రోడ్లూ అధ్వాన్నంగా మారిన పరిస్థితిని నాకు నా నియోజకవర్గం ప్రజలే కాకుండా డెల్టా ప్రాంతంలోని ప్రజలందరూ నాకు వర్చువల్ విధానంలో సమావేశమైనప్పుడల్లా చెబుతూనే ఉన్నారు. వివిధ సమాచార మాధ్యమాల ద్వారా నా ప్రాంత ప్రజలు నాకు అక్కడి దారుణమైన రోడ్ల ఫొటోలను, ఛిత్రమైపోయిన రహదారుల ఫొటోలను ఎప్పటికప్పుడు పంపుతూనే ఉన్నారు. నా జిల్లా, మరీ ముఖ్యంగా నా నియోజకవర్గం నుంచి ఎగుమతులు ఎక్కువగా జరుగుతుంటాయి. తద్వారా ప్రభుత్వానికి ఎంతో ఆదాయం సమకూరుతుంది. ఈ విధమైన ఆర్ధిక కార్యకలాపాలను మరింత పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఉండాలి. అంటే ఈ ప్రాంత రహదారులపై మరింత ఎక్కువ శ్రద్ధ చూపడం ద్వారా భారీ రవాణా వాహనాలకు ఊతమిచ్చే విధంగా రహదారుల నిర్మాణం జరపాలి. క్రమం తప్పకుండా మరమ్మతులు ఉండాలి. ఓడరేవులు, విమానాశ్రయాలకు వెళ్లే రహదారులపై మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

మీరు ఆటో డ్రైవర్లకు సంక్షేమం పేరుతో ఇస్తున్న డబ్బులు ఈ దారుణమైన రోడ్లపై ఆటోలు నడిపినందుకు అయ్యే మరమ్మతులకు, వాహనం నిర్వహణకు సరిపోతాయి. ఇలాంటి దారుణమైన రోడ్ల కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతాయి. గుంతల రోడ్లపై ప్రయాణం చేయడం ద్వారా డ్రైవర్ల ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోతుంది. బ్రతుకు బండి లాగడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో గతుకుల రోడ్లపై బండి తోలడం అంతకన్నా సంక్లిష్టంగా మారింది.

రాష్ట్ర ప్రజలు మిమ్మలను అశోక చక్రవర్తి లాగానో, చంద్రగుప్త రాజు లాగానో మారిపొమ్మని చెప్పడం లేదు. వారు రహదారులను నిర్మించి, మారుమూల ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేశారు. మీరు మొఘల్ చక్రవర్తుల్లా మారితే చాలు అని ప్రజలు అంటున్నారు. అంతకు ముందు పాలకులు నిర్మించిన రహదారులను మొఘల్ చక్రవర్తులు చక్కగా నిర్వహించారు. ఇప్పుడున్న రోడ్ల పరిస్థితి అప్పటిలో వారు నిర్మించిన గ్రాండ్ ట్రంక్ రోడ్లకు పూర్తిగా భిన్నంగా ఉంది. అప్పటి ట్రంక్ రోడ్లు అద్దంలా ఉండేవి… ఇప్పుడు అడ్డదిడ్డంగా ఉన్నాయి. 

రాష్ట్రంలోని ఏ రోడ్డూ కూడా వాహనదారుడి సుఖం కోరడం లేదు. మంచి ఫలితాలు రావాలంటే మంచి రోడ్లు ఉండాలనే విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి. నేను ఈ సందర్భంగా మీకు ఇచ్చే సలహా ఏమిటంటే మీరు కొంత కాలం పాటు హెలికాప్టర్లు, విమానాలలో ప్రయాణం చేయవద్దు. మీరు త్వరలో ప్రారంభించబోతున్న రచ్చబండ కార్యక్రమాన్ని అయినా రోడ్డు మార్గంలో ప్రయాణం చేసి మొదలెట్టండి. మా తీర ప్రాంతాలలో మీరు రోడ్డు ప్రయాణం చేయడం ద్వారా రోడ్లు మీ పాలనలో ఎంత బాగున్నాయో మీరే కనులారా వీక్షించవచ్చు. తనువారా ఆస్వాదించవచ్చు. తద్వారా ప్రజలు అనుభవిస్తున్న ‘‘రోడ్డు బాధలు’’ మీకూ అర్ధం అవుతాయి. అప్పుడైనా మీరు రహదారుల అభివృద్ధిపై శ్రద్ధ చూపుతారు. ఇదే నా ఆశ.

భవదీయుడు,
కె.రఘురామ కృష్ణంరాజు.

Follow Us:
Download App:
  • android
  • ios