Asianet News TeluguAsianet News Telugu

అలా చేశారంటే... ఎన్టీఆర్ పరిస్థితే మీక్కూడా: సీఎం జగన్ ను హెచ్చరించిన రఘురామ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయసును వైసిపి ప్రభుత్వం తగ్గించడానికి ప్రయత్నిస్తోందన్న ప్రచారంపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత సీఎం జగన్మోహన్ రెడ్డిపై వుందంటూ ఎంపీ రఘురామ పేర్కొన్నారు. 

raghurama krishnamraju writes a another letter to cm ys jagan over employees retirement age  akp
Author
Amaravati, First Published Jul 14, 2021, 9:36 AM IST

న్యూడిల్లీ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పక్కలో బల్లెంలా మారిన విషయం తెలిసిందే. జగన్ కు తాను విధేయుడినని పేర్కొంటూనే ప్రభుత్వం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలను ఎండగడుతూ వున్నారు రఘురామ. ఇలా కొద్దిరోజులుగా సీఎం జగన్ కు వరుస లేఖలు రాస్తూ ప్రభుత్వ విధానాలను తప్పుబడుతున్నాడు. ఇప్పటికే నవ హామీలు - వైఫల్యాలు పేరుతో తొమ్మిది లేఖలు రాసిన రఘురామ ఆ తర్వాత నవ ప్రభుత్వ కర్తవ్యాలు పేరుతో మరికొన్ని లేఖాస్త్రాలు సంధించారు. ఇప్పుడు నవ సూచనలపేరిట లేఖలు రాస్తున్నారు. తాజాగా మంగళవారం బుధవారం ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు వైసిపి సర్కార్ తగ్గిస్తోందన్న వదంతులపై స్పందిస్తూ మరో లేఖ రాశారు రఘురామ.   

జగన్ కు రఘురామ రాసిన లేఖ యధావిధిగా: 

జులై 14, 2021
శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,
ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

విషయం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయసు-వదంతులు పై వివరణ ఆవశ్యకత

సూచిక: నవ సూచనలు (విధేయతతో) లేఖ 7

ముఖ్యమంత్రి గారూ,
పదవీ విరమణ … అంటే పని చేసే ప్రదేశం నుంచి విరామం తీసుకుని తన కోసం నూతన జీవితాన్ని మళ్లీ మొదలు పెట్టడం. పని వత్తిడి వదిలేసి తమ వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించే సమయం కావడంతో పదవీ విరమణ వయసుపై ప్రతి సారీ చర్చోపచర్చలు జరుగుతూనే ఉంటాయి. ఏ వయసులో పదవీవిమరణ చేయాలి అనేది చర్చనీయాంశమైన పెద్ద ప్రశ్న. కష్టపడి కొండ ఎక్కి శిఖరానికి చేరుకున్న తర్వాత అక్కడ నుంచి ప్రపంచాన్ని చూస్తూ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తేదీ ఉంటుంది. 

పదవి విరమణ చేసిన తర్వాత వచ్చే ఆదాయం ఎంతో గుణించుకుని వారు తమ శేష జీవితాన్ని ఆనందంగా గడిపే ఉత్తమ క్షణాలు అవి. ఇలాంటి ఉద్విగ్నభరితమైన అంశంలో మీరు  నిర్ణయం తీసుకోబోతున్నారని వదంతుల  రూపంలో వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆపరిస్ధితిని  తలచుకుని నా మనసు వికలం అయింది. మీరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించబోతున్నారని విన్న తర్వాత నా మనసు అల్లకల్లోలం అయింది. అయితే అది వదంతి మాత్రమేనని తెలిసి కొంత ఊపిరి పీల్చుకున్నాను. అయినా ఎందుకైనా మంచిదని కొన్ని విషయాలు మీ దృష్టికి తెస్తున్నాను.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం భారతీయుడి ఆయు:ప్రమాణం 65 సంవత్సరాలు. ఈ లెక్కతోనే 1998లో కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగుల పదవీవిరమణ వయసును 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు పెంచింది. పదవీ విరమణ వయోపరిమితి నిర్ణయించిన నాటి కాలం తో పోలిస్తే ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో భారతీయుడి ఆయు:ప్రమాణం మరింత మెరుగైంది. ఏపి పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (పదవీ విమరణ వయసు సడలింపు) చట్టం 1984 ను 2017లో చివరి సారిగా మార్చారు. అప్పటి వరకూ ఉన్న 58 ఏళ్ల పదవీ విరమణ వయసును 60 సంవత్సరాలకు పెంచుతూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మీరు మీ మనసులో ఇప్పుడు అనుకుంటున్నట్లుగా కాకుండా, గత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం హర్షించదగినదే. 

మన పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచారు. 35 సంవత్సరాల పాటు సవరించకుండా ఉన్న ఈ నిబంధనను రాష్ట్రం ఏర్పడిన ఏడు సంవత్సరాలలో సవరించుకున్నారు. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రమే దేశంలో కెల్లా అతి ఎక్కువ పదవీ విరమణ వయసు ఉన్న రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే భౌగోళిక, సామాజిక, రాజకీయ పరిస్థితులతో బాటు జన జీవన విధానంలో కూడా అన్ని సారూప్యతలూ ఉన్న మన రాష్ట్రంలో పదవీ విరమణ వయసు పరిమాణాన్ని ఎందుకు తగ్గిస్తున్నారో ఎవరికి బోధపడటం లేదు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో, 1956 నుంచి కూడా చూస్తే పదవీ విరమణ వయసు 58 సంవత్సరాలు ఉండేది. అన్ని రాష్ట్రాలలో కూడా పదవీ విరమణ వయసు 60 సంవత్సరాలు లేదా 58 సంవత్సరాలు ఉన్నది. అయితే మీరు 57 సంవత్సరాలకే పదవీ విరమణ వయసును కుదించాలని అనుకోవడం అత్యంత దారుణం, తీవ్ర నిరాశ కలిగించే నిర్ణయం. 

మీకు ఈ సందర్భంగా చరిత్రలో జరిగిన కొన్ని విషయాలను తెలియచేస్తాను. 1985లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు పదవీ విరమణ వయసును 56 సంవత్సరాలకు కుదించారు. ఆయన అలా చేసినందుకు అన్ని ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. న్యాయస్థానాలు కూడా ఉద్యోగ సంఘాల వాదనలనే బలపరిచాయి. ఇప్పుడు మీరు అలాంటి నిర్ణయమే తీసుకుంటే అలాంటి ప్రతిఘటనలే సాధారణ ప్రజల నుంచి, న్యాయస్థానాల నుంచి కూడా మీరు ఎదుర్కునే అవకాశాలు ఉంటాయి.

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును తగ్గించాలని మీరు తలపోస్తున్న ఈ కొత్త ఆలోచనకు విరుద్ధంగా మీరు ఇటీవల ఒక నిర్ణయం తీసుకోవడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. మీకు అత్యంత విధేయుడుగా ఉండి పలు అంశాలలో, నాకు సంబంధించిన అంశాలతో సహా, మీ మనోవాంఛను తీర్చిన సిఐడి అదనపు ఎస్ పి అయిన విజయ పాల్ కు మాత్రం ఆయన తన 60 సంవత్సరాల వరకూ పని చేసి, పదవీ విరమణ చేసినా, మళ్లీ తిరిగి ఆయనను కాంట్రాక్టు ప్రాతిపదికన మరింత సర్వీసును బహుమతిగా ఇచ్చారు. అదే విధంగా పదవీ విరమణ చేసిన జస్టిస్ కనగరాజ్ కు 80 సంవత్సరాలకు పైబడి ఉన్న వయసులో కూడా పదవి ఇచ్చి సత్కరించారు. పాపం… ఆయనకు అంత ముదిమి వయసులో కూడా అత్యంత ఎక్కువ పని భారం ఉండే పోలీసు ఫిర్యాదుల అథారిటీ చైర్మన్ బాధ్యతలను అప్పగించారు. ఈ రెండు సంఘటనల్లో కూడా వయసు వచ్చి పదవీ విమరణ చేసిన వారినే మళ్లీ పిలిచి మరీ బాధ్యతలు అప్పగించారు.

గ్రామ సర్పంచ్ ల నుంచి కొన్ని బాధ్యతలను ఊడబెరికి వాటిని విఆర్ఓ కు కట్టబెడుతూ మన ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.2ను రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేసిన ఘటనను కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ మరో ఉదాహరణ చెబుతున్నాను. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులైన సర్పంచ్ ల నుంచి అధికారాలలో కోత విధించి ప్రభుత్వ ఉద్యోగులైన వారికి (విఆర్ఓ లకు) ఎక్కువ అధికారాలు ఇవ్వాలని మీరు ప్రయత్నించారు. దీనికి విరుద్ధంగా మీరు మరో విచిత్రమైన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల వార్షిక పనితీరు నివేదికను తయారు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆయన నుంచి ఆ అధికారాన్ని ప్రజాప్రతినిధి అయిన మీరు లాక్కుంటున్నారు. మీరు చేస్తున్న ఈ పరస్పర విరుద్ధమైన పనులను, ఈ అసంబద్ధమైన నిర్ణయాలను ఎవరైనా సరే సాధారణ నిర్ణయాలుగా పరిగణనించగలరా? ఇలాంటి మీ చర్యల ద్వారా మీ ద్వైదీభావనలను వెల్లడించడమే కాకుండా ప్రతి చోటా ఒక రకమైన సందిగ్ధతను, సంశయాన్నీ కావాలని రుద్దుతున్నట్లుగా అనిపిస్తున్నది. ఇలాంటి చర్యలన్నీ మీ పక్షపాత వైఖరిని వెల్లడిస్తున్నాయి. అంతే కాదు మిమ్మల్ని ఆశ్రయించిన వారికి సాధారణ ప్రజలకు మీరు వ్యత్యాసం చూపుతున్నారని మరింత స్పష్టంగా కనిపిస్తున్నది. దీన్నే తెలుగు సామెతలో చెప్పాంటే ‘‘ అయినోళ్లకి ఆకుల్లో, కానోళ్లకు కంచంలో’’.

పైన పేర్కొన్న అన్ని విషయాలలోనూ ఎలాంటి చర్చలు జరపకుండా, ఎవరి అభిప్రాయం తీసుకోకుండా మీ అంతట మీరు స్వయంగా నిర్ణయాలు తీసుకున్నారు. మీరు ఈ సందర్భంగా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఆదరాబాదరాగా తీసుకుంటున్న పరస్పర విరుద్ధ నిర్ణయాలు, అస్పష్టతను మరింతగా పెంచే నిర్ణయాలన్నీ ఎలాంటి సత్ఫలితాన్నిచ్చే అవకాశమే ఉండదు. మీరు ఎంత ఆరాటపడి ఇలాంటి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకుంటే అంతలా మీరు పశ్చాత్తాపం చెందాల్సి వస్తుంది.

మనం మన ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు చెల్లించలేకపోతున్నాం. అదే విధంగా పదవీ విరమణ చేసిన మన మాజీ ఉద్యోగులకు పెన్షన్లు కూడా ఇవ్వలేకపోతున్నాం. ఇంతటి దారుణమైన ఆర్ధిక పరిస్థితిలో ఉన్న మనం వయసు తగ్గించడం వల్ల పదవీ విరమణ చేసే 15,000 నుంచి 16,000 మంది ఉద్యోగులకు పదవీ విరమణ లాభాలను కూడా కలిపి ఎలా ఇవ్వగలుగుతాం? అదీ కూడా బడ్జెట్ లో ఎలాంటి వెసులుబాటు పెట్టుకోకుండా అర్ధంతరంగా తీసుకునే నిర్ణయంతో పడే ఆర్ధిక భారాన్ని ఎలా పూడ్చుకోగలుగుతాం? మీరు గుర్తించాల్సింది ఏమిటంటే వయసు అనేది కేవలం మన భావనే, సత్తాకు సూచిక కాదు. సమర్ధత ముందు వయసు పెద్ద విషయమే కాదు. అందువల్ల మీరు తక్షణమే మీ ఆలోచన మార్చుకోండి. కనీసం జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న మీరు ప్రభుత్వ ఉద్యోగుల వెంట ఎందుకు పడుతున్నారు?

మీ ఆలోచనలను రాష్ట్రంలోకి వచ్చే పారిశ్రామికవేత్తలను ఎలా ప్రోత్సహించాలా అనే అంశంపైకి మళ్లించండి. రాష్ట్రంలో వారితో పెద్ద పెద్ద కర్మాగారాలు, ప్రాజెక్టులు పెటించే దిశగా ప్రోత్సహించండి. అలా కాకుండా వారితో తెరవెనుక కార్యక్రమాలు నిర్వహించి ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు కూడా మూతపడేలా చేయకండి. నోటీసులు ఇవ్వడం ద్వారా లేదా ఎవరూ గమనించకుండా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా మాటకలిపి వారు కూడా మీ కక్షపూరిత వైఖరికి అయిష్టంగానైనా మద్దతు ఇచ్చేలా వత్తిడి తీసుకురాకండి. మీరు ఇలా చేస్తున్న ఒక ప్రయత్నం ప్రస్తుతానికి మన మధ్యే ఉండనివ్వండి. 

వయసు పెరగడం అనేది మన చేతుల్లో లేనిది. అయితే పురోగమించడం అనేది మాత్రం కచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది. ఈ తేడా తెలసుకోవడానికి కొంచెం సమయం తీసుకుని అయినా సరే మీరు ఆలోచించండి. పురోభివృద్ధి సాధించడం అనేది మన ప్రవర్తన పై ఆధారపడి ఉంటుంది. అందువల్ల నేను, ఈ సందర్భంగా మిమ్మల్ని కోరేది ఏమిటంటే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును తగ్గించే ఆలోచనను మానుకోండి. ఎంతో మంది యువకులకు మేలు కలిగించే విధంగా ప్రయివేటు సెక్టార్ లో ఉద్యోగాల కల్పనపై శ్రద్ధ పెట్టండి. మీ దృష్టి విధ్వంసం పై నుంచి నిర్మాణాత్మక విధానాలపైకి సారించండి. తగ్గించడం పై కాకుండా పెంచడం పైకి మరల్చండి. అలా చేయడం ద్వారా వ్యవహారాలు చక్కబడతాయి. 

ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య స్నేహపూర్వక వాతావరణం కొనసాగుతుంది. ఎంతో అనుభవంతో కూడిన ప్రభుత్వ ఉద్యోగులను అక్కున చేర్చుకోవడం ద్వారా వారి మొహంలో చిరునవ్వు నింపండి. ఇప్పటి వరకూ వ్యాపించిన వదంతులు  సీనియర్ ఉద్యోగుల మనస్సులో కొంత అభద్రతా భావం కలిగిస్తున్నాయి. అందువల్ల మీరు లేదా సంబంధిత మంత్రులు లేదా అధికారులు తగిన వివరణ ఇవ్వడం సముచితం.. అంతేకాని ఉద్యోగ సంఘాల నాయకులు ఇచ్చే వివరణకు విశ్వసనీయత ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఉద్యోగుల  ఆశీర్వాదం తీసుకోండి. అంతేకానీ శాపం కాదు.

భవదీయుడు,
కె.రఘురామ కృష్ణంరాజు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios