ఏలూరు: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద పోరును తీవ్రం చేయాలని తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు భావిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇందులో భాగంగా ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. శుక్రవారం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. 

ఢిల్లీలో ఆయన లోకసభ స్పీకర్ ఓంబిర్లాను కలుస్తారు. అంతేకాకుండా హోం శాఖ కార్యదర్శితో కూడా భేటీ అవుతారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ ను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. తనకు రక్షణ లేదని ఆయన ఇప్పటికే లోకసభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన స్పీకర్ కు ఓ లేఖ రాశారు. 

Also Read: జగన్ అపాయింట్ మెంట్: రఘురామ కృష్ణమరాజుకు మోపిదేవి కౌంటర్

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తనకు షోకాజ్ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ఆయన సాంకేతికపరమైన అంశాలను లేవనెత్తారు. దానిపై ఎన్నికల కమిషనర్ కు ఆయన వివరణ ఇచ్చే అవకాశం ఉంది. విజయసాయి రెడ్డి జారీ చేసిన షోకాజ్ నోటీసుకు చట్టబద్దత లేదని ఆయన వాదించారు.  

రాష్ట్ర స్థాయి పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారనే ఆంశాన్ని ఆయన లేవనెత్తడం పక్కన పెడితే తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెసు పార్టీ నుంచి ఎంపీగా గెలిచానని, ఆ పేరు మీదనే తనకు బీ ఫారమ్ ఇచ్చారని, అయితే విజయసాయి రెడ్డి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పేరు మీద షోకాజ్ నోటీసు ఇచ్చారని, అందువల్ల ఆ షోకాజ్ నోటీసుకు చట్టబద్దత లేదని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని ఆయన ఎన్నికల కమిషన్ కు వివరించే అవకాశం ఉంది.

Also Read: రఘురామ కృష్ణమరాజు వ్యూహం ఇదే: వైఎస్ జగన్ టార్గెట్

అలాగే, తనకు రాష్ట్రంలో భద్రత లేదని స్పీకర్ కు, హోం శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. తనకు తగిన భద్రత కల్పించాలని ఆయన కోరే అవకాశం ఉంది. ఇదంతా ఆయన వైఎస్ జగన్ ను ఎదుర్కుని సాఫీగా పార్టీ నుంచి బయటపడడానికి చేస్తున్న ప్రయత్నంగా భావిస్తున్నారు. 

ఇదిలావుంటే, ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ అపాయింట్ మెంట్ దొరకడం లేదనే పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమరాజు వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ కౌంటర్ ఇచ్చారు. పని ఒత్తిడి వల్ల జగన్ అపాయింట్ మెంట్ దొరికి ఉండకపోవచ్చునని ఆయన అన్నారు. 

అయితే, జగన్ అందరికీ అందుబాటులో ఉంటారని ఆయన శుక్రవారం చెప్పారు. మోపిదేవి వెంకటరమణ శుక్రవారం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంతటివారైనా పార్టీకి విధేయులుగా ఉండాల్సిందేనని, ఈ విషయంలో సరిగా లేరు కాబట్టే రఘురామకృష్ణమ రాజుకు నోటీసులు జారీ అయ్యాయని ఆయన అన్నారు.