న్యూఢిల్లీ: అప్పుల విషయంలో వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఎత్తిపొడిచారు. అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ అనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన గురువారంనాడు అన్నారు.

ఏ రాష్ట్రం చేయనన్ని అప్పులు ఆంధ్రప్రదేస్ చేస్తోందని ఆయన అన్నారు. పక్క రాష్ట్రం తెలంగాణ అప్పులు తీసుకుంటున్నప్పటికీ అభివృద్ధిలో పురోగతి సాధిస్తోందని ఆయన అన్నారు. స్నేహవూర్వకంగా మెదులుతున్న కేసీఆర్ నుంచి జగన్ ఎందుకు నేర్చుకోలేదని ఆయన ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు రోడ్ల దుస్థితికి బాధపడుతున్నారని ఆయన చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు జగన్ కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ ఆర్ట్స్ కాలేజీకి క్రిస్టియన్ ప్రిన్సిపాల్ ను నియమించవద్దని ఆయన కోరారు.

ఢిల్లీలో మకాం వేసిన రఘురామ కృష్ణమ రాజు ప్రతి రోజూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. దేవాలయాలపై దాడుల మీద, తిరుమల శ్రీవారి దర్శనానికి వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోపడంపై ఆయన గతంలో విమర్శలు చేశారు. తనపై దాడులు చేయించేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.