Asianet News TeluguAsianet News Telugu

అలా చేసి సంతోషించారు: వైసీపీపై మరోసారి రఘురామ ధ్వజం

లోకసభలో తన సీటు వెనక్కి మార్చడంపై వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు స్పందించారు. ఆయన బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.

Raghurama Krishnama raju meets BJP chif JP Nadda
Author
New Delhi, First Published Jul 18, 2020, 2:13 PM IST

న్యూఢిల్లీ: లోకసభలో తన సీటును మార్చడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఎంపి రఘురామకృష్ణమ రాజు స్పందించారు. తన సీటు మార్చగలరే గానీ తనను ఏమీ చేయలేరని ఆయన అన్నారు. తనపై ఇచ్చిన అనర్హత పిటిషన్ పనిచేయదు కాబట్టి తన సీటు మార్చి సంతోషించాలని అనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ఆయన బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. ఏపీలో శాంతిభద్రతల గురించి తనకు తెలియదని, తనకు మాత్రం రక్షణ లేదని ఆయన చెప్పారు. ఈ నెల 21వ తేదీన తాను రాష్ట్రపతిని కలిసి తన రక్షణపై మాట్లాడుతానని ఆయన చెప్పారు. నడ్డాతో రాజకీయ పరిస్థితుల గురించి చర్చించలేదని, ఏపీలో పరిస్థితులు చర్చకు వచ్చాయని ఆయన చెప్పారు. 

ఇదిలావుంటే, తమ తిరుగుబాటు పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణమ రాజుకు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ షాక్ ఇచ్చింది. తమ పార్టీ తరఫున నర్సాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన సీటును పార్లమెంటులో వెనక్కి మార్చింది. గతంలో నాలుగో లైన్ లో ఉన్న ఆయన సీటును ఏడో లైన్ లోకి మారుస్తూ లోకసభ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. 

వైసీపీ పక్ష నేత ఇచ్చిన సూచన మేరకు ఈ మార్పులు చేసినట్లు సంబంధిత అధికారులు చెప్పారు. ఏడో లైన్ లో ఉన్న వైసీపీ ఎంపీ మార్గాని భరత్ సీటును ఆయనకు కేటాయించారు. భరత్ కు రఘురామ కృష్ణమ రాజు సీటు కేటాయించారు. 

రఘురామకృష్ణమ రాజు 379వ సీటులో ఉండేవారు. ఇప్పుడు 445వ సీటుకు మారారు. మార్గాని భరత్ 385 నుంచి 379కు వచ్చారు. వారితో పాటు కోటగిరి శ్రీధర్ సీటును 421 నుంచి 385కు మార్చారు. బెల్లన చంద్రశేఖర్ సీటును 445 నుంచి 421 మార్చారు.

రఘురామకృష్ణమ రాజు గత కొంత కాలంగా వైసీపీ నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయనకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి షోకాజ్ నోటీసు జారీ చేశారు. దానికి రఘురామకృష్ణమ రాజు సమాధానం ఇవ్వకుండా మరిన్ని వ్యాఖ్యలు చేశారు. 

ఈ నేపథ్యంలో రఘురామకృష్ణమ రాజుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైసీపీ ఎంపీలు లోకసభ స్పీకర్ ఓంబిర్లాను కోరారు. ఈ మేరకు వారు అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. దానిపై కూడా రఘురామకృష్ణమ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు

Follow Us:
Download App:
  • android
  • ios