ఏలూరు: తన పార్టీ నాయకులు తనపై చేస్తున్న విమర్శలను వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ (వైసీపీ) తిరుగుబాటు పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజు తిప్పికొట్టారు. సింహం సింగిల్ గానే వస్తుందని ఆయన అన్నారు. పందులే గుంపులుగా వస్తాయనే విధంగా అసెంబ్లీ లాబీలో తనపై పడ్డారని ఆయన అన్నారు. 

వైసీపీలోకి వస్తానని తాను బతిమాలడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నిరుడు రిషీ అనే వ్యక్తి ద్వారా ప్రశాంత్ కిశోర్ తనను కలిశారని, పార్టీలో చేరాలని తనను ప్రలోభ పెట్టారని ఆయన చెప్పారు. తనను ఏ విధంగా ప్రలోభపెట్టారో అక్కడే ఉన్న విజయసాయిరెడ్డిని, రాజిరెడ్డిని అడగాలని ఆయన అన్నారు. 

తాను వైఎస్ జగన్ ఇంటికే వెళ్లలేదని, విమానాశ్రయంలో ఒక్కసారి మాత్రమే జగన్ ను కలిశానని ఆయన అన్నారు. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

"ఎవరండీ వీళ్లు, అఫ్ట్రాల్ గాళ్లు.. ఈ జోకర్లు... ఎప్పుడైనా నా గురించి జగన్ కు చెప్పారా... జగన్ ను అడగండి. ఆయన అబద్ధం చెప్ప. వాళ్లంతా దొంగులు, ప్రజల నుంచి డబ్బులు, చెక్కులు వసూరు చేశారు" అని ఆయన ధ్వజమెత్తారు. 

తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఇసుక దొంగ అని, స్థలాల పేరు మీద ఇసుకను దోచేశాడని ఆయన అన్నారు. ఎన్ని సార్లు నా చుట్టు తిరిగావో.. దేనికోసం తిరిగావో నీకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. ఆ దొంగ గురించి ఆయన మేనల్లుడిని అడిగితే వివరంగా చెబుతాడని రఘురామకృష్ణమ రాజు అన్నారు. 

కారుమూరి నాగేశ్వర రావు గురించి చెప్పనే అక్కరలేదని ఆయన అన్నారు. ఇళ్ల స్థలాల సేకరణ, ఇళ్ల పట్టాలకు సంబంధించి 70 శాతం ఫిర్యాదులు నాగేశ్వర రావు మీదనే వచ్చాయని ఆయన అన్నారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సౌమ్యుడని, నిజాయితీపరుడని, జగన్ అపాయింట్ మెంట్ దొరకడం లేదని చాలా సార్లు బాధపడ్డారని ఆయన అన్నారు. 

అలాంటి వ్యక్తి తనపై అలా ఎందుకు మాట్లాడారో అర్థం కావడం లేదని అన్నారు. మంత్రి శ్రీరంగనాథ రాజు చేసేంత అవినీతి, దుర్మార్గం ఎక్కడా లేదని ఆయన అయన అన్నారు. కలెక్టర్ కు వచ్చే ఫిర్యాదుల్లో సగం ఆయన మీదనే ఉంటాయని రఘురామకృష్ణమ రాజు అన్నారు.