అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకాల పేరిట భారీ కుంభకోణం జరిగిందని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ విషయంపై ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

ప్రశ్నపత్రాలను లీక్ చేసి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని చంద్రబాబు విమర్శించారు. ప్రశ్న పత్రాలను లీక్ చేసి లక్షలాది మంది నిరుద్యోగులను దగా చేశారని ఆయన విమర్శించారు. ఏమిటి తమాషాలా, రాష్ట్రంలో ఏం జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. 

మోసపోయిన నిరుద్యోగులకు ఎలా న్యాయం చేస్తారని ఆయన డిమాండ్ చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన ప్రశ్నపత్రాల లీకేజీ వార్తలపై స్పందించారు. ఒక అవినీతిపరుడికి అధికారం వస్తే జరిగేది ఇంకా పెద్ద అవినీతి అని ఈ జగన్ ప్రభుత్వం నిరూపిస్తోందని ఆయన అన్నారు. 

నిన్నటికి నిన్న గ్రామ వలంటీర్ల ఉద్యోగాలన్నీ వైసిపి కార్యకర్తలకు కట్టబెట్టి ఉత్తుత్తి ఇంటర్వ్యూలతో నిరుద్యోగులను మోసం చేశారని ఆయన అన్నారు. నిరుద్యోగులతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని శ్రీకాకుళం జిల్లా టీడీపి అధ్యక్షురాలు గౌతు శిరీష్ విమర్శించారు.