భార్యతో గొడవ.. కదులుతున్న ఆటోలోంచి దూకి భర్త మృతి...
మద్యం మత్తులో భార్యతో గొడవపడి కదులుతున్న ఆటోలోనుంచి దూకేశాడో భర్త. తలకు బలమైన గాయాలు కావడంతో మృతి చెందాడు.

తిరుపతి : భార్యతో గొడవపడి కదులుతున్న ఆటోరిక్షాలో నుంచి దూకిన ఓ నడివయస్కుడు మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలో ఈ వింత ప్రమాదం జరిగింది.
మృతుడు జ్ఞానమ్మ కండ్రిగ గ్రామానికి చెందిన కొట్లపాటి సుబ్రహ్మణ్యం (35) మణిగా గుర్తించారు. అతను స్థానిక ఇటుకల తయారీ యూనిట్‌లో పనిచేసేవాడు. మణి, అతని భార్య సుబ్బమ్మ రాజుల కండ్రిగలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్నారు. తమ బంధువులుఎవరో చనిపోతే దానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని ఆటోరిక్షాలో తిరిగి వస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
యూట్యూబ్ వీడియో కోసం వన్యప్రాణిని చంపిన ముగ్గురు: అరెస్ట్ చేసిన అనంతపురం పోలీసులు
ఆ సమయంలో మణి మద్యం మత్తులో ఉన్నాడని, అకస్మాత్తుగా తన భార్యతో తీవ్ర వాగ్వాదానికి దిగాడని సమాచారం. గొడవ జరగడంతో రెచ్చిపోయిన భర్త ఆవేశంతో కదులుతున్న వాహనంలోంచి దూకడంతో తలకు బలమైన గాయమైంది. వెంటనే శ్రీకాళహస్తి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.