మంత్రుల గొడవలతో టిడిపిలో ముసలం

First Published 3, Apr 2018, 10:32 AM IST
quarrel between ganta and ayyanna causes concern in TDP
Highlights
ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో అభిప్రాయబేధాలను సర్దుకుని ఒకటవ్వాల్సింది పోయి రోడ్డున పడుతున్నారు.

తెలుగుదేశంపార్టీలోని వర్గ రాజకీయాలు రోజురోజుకు ముదిరిపోతున్నాయి. ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో అభిప్రాయబేధాలను సర్దుకుని ఒకటవ్వాల్సింది పోయి రోడ్డున పడుతున్నారు. అందుకు విశాఖపట్నం జిల్లాలోని మంత్రుల తీరే తాజా ఉదాహరణగా నిలుస్తోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే, పశుగణాభివృద్ధి సంస్ధ కమిటి ఛైర్మన్ విషయంలో మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య అగ్గి రాజుకుంది. తన మద్దతుదారుడి స్ధానంలో గంటా మద్దతుదారుడిని నియమించటంతో అయ్యన్న మండిపోతున్నారు. అదే విషయాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప దగ్గర ప్రస్తావించి పెద్ద పంచాయితీనే పెట్టారు. దాంతో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్ధంకాక నిమ్మకాయల తల పట్టుకున్నారు.

మొదటి నుండి కూడా జిల్లా రాజకీయాల్లో చింతకాయలది, గంటాది వ్యతిరేక వర్గమే. చాలా కాలంపాటు ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉండేవారు కాబట్టి ప్రత్యర్ధులుగానే ఉన్నారు. అయితే, ఇపుడు ఇద్దరూ టిడిపిలోనే ఉండటం పైగా మంత్రులవ్వటంతో సమస్య ముదిరి పాకానపడింది.

జిల్లాపార్టీలోని మెజారిటీ నేతలు చింతకాయలకు పూర్తి మద్దతుగా నిలుస్తున్నారు. అదే సమయంలో గంటా ఆర్థికంగా బాగా బలవంతుడవటంతో కొందరు ఆయనకు కూడా మద్దతిస్తున్నారు. అంతేకాకుండా అధికారయంత్రాంగంలో బాగా పట్టుఉంది. దాంతో చింతకాయలను ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తొక్కేస్తున్నారు. దాంతో చింతకాయల వేరే దారిలేక చాలాసార్లు మీడియా ముందు తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారు.

జిల్లాలోని 14 మంది ఎంఎల్ఏల్లో సుమారు 5 మంది గంటాకు మద్దతుదారులు. మిగిలిన వారిలో ఓ నలుగురు చింతకాలకు మద్దతుగా నిలుస్తున్నారు. మిగిలిన వారు అవసరాన్ని బట్టి ఉంటారు. అయితే, పార్టీలోగానీ జనాల్లో కానీ చింతకాలయకున్న క్రెడిబులిటి గంటాకు లేదన్న విషయం వాస్తవం.

ఎందుకంటే, పార్టీ ఆవిర్భావం నుండి చింతకాలయ టిడిపిలోనే ఉంటే గంటా పదవుల కోసం అనేక పార్టీలు మారారు. రేపటి ఎన్నికల్లో టిడిపి తరపునే పోటీ చేస్తారన్న గ్యారెంటీ కూడా లేదు.  ఇటువంటి పరిస్ధితుల్లో మంత్రులిద్దరి మధ్య తారస్ధాయికి చేరుకుంటున్న వర్గపోరు రేపటి ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని అందరూ ఆందోళన పడుతున్నారు.

loader