సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. వైసిపి ప్రభంజనం సృష్టించినా పీవీపీకి నిరాశ తప్పలేదు. పీవీపీపై టిడిపి సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించారు. ఫలితాలు వెలువడ్డాక తొలిసారి పివిపి స్పందించారు. తాను గెలిచినా గెలవకపోయినా ఎప్పటికీ విజయవాడ వాడినేనని అన్నారు. 

ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉండగా రాజకీయాల్లోకి వచ్చా. విజయవాడ పార్లమెంట్ పరిధిలో నేను పర్యటించింది కేవలం 19 రోజులు మాత్రమే. ఇంకాస్త ముందుగా వచ్చి నియోజకవర్గం మొత్తం పర్యటించి ఉంటే అత్యధిక మెజారిటీతో గెలిచేవాడిని. అయినప్పటికీ విజయవాడ పార్లమెంట్ పరిధిలో వైసిపి ఎమ్మెల్యేలు గెలుపొందారు. వైసీపీకి ఓట్లువేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని పీవీపీ అన్నారు. 

ఇకపై తాను విజయవాడ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని అన్నారు. వైసిపి 130కి పైగా సీట్లలో విజయం సాధిస్తుందని అంచనా వేసినవారిలో మొదటి వ్యక్తిని నేనే అని పీవీపీ అన్నారు. కానీ నా మాటలని ఎవరూ నమ్మలేదు. ఫలితాల్లో వైసీపీ 151 సీట్లని గెలుచుకుంది గుర్తు చేశారు.