ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు కలిశారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో బంగారు పతకం సాధించిన నేపథ్యంలో సింధు.. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.

అంతకుముందు గన్నవరం విమానాశ్రయంలో సింధు కుటుంబసభ్యులకు మంత్రి అవంతి శ్రీనివాస్, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మూడో ప్రయత్నంలో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ సాధించానని.. ఈ సమయంలో సీఎం తనకు ఫోన్ చేసి అభినందించారని సింధు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపేందుకే తాను విజయవాడ వచ్చినట్లు ఆమె స్పష్టం చేసింది.

Image

పర్యటనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను సింధు కలవనున్నారు. అలాగే ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌లో బంగారు పతకం సాధించినందుకు గాను.. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటలకు సన్మానం జరగనుంది.