దిగొచ్చిన పుట్టా సుధాకర్ యాదవ్: టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా
ఎట్టకేలకు దిగొచ్చారు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్. టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయనంటూ ఇన్నాళ్లు చెప్పుకొచ్చిన ఆయన ఎట్టకేలకు దిగొచ్చారు. టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.
తిరుపతి: ఎట్టకేలకు దిగొచ్చారు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్. టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయనంటూ ఇన్నాళ్లు చెప్పుకొచ్చిన ఆయన దిగిరాక తప్పలేదు. దాంతో టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.
రాజీనామా లేఖను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కుఫ్యాక్స్ ద్వారా పంపించారు. తన వ్యక్తిగత కారణాల వల్ల టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాల్సిందిగా కోరారు సుధాకర్ యాదవ్.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ చైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేస్తారని అంతా భావించారు. రాజీనామాకు ససేమిరా అన్నారు పుట్టా. తిరుమల వెంకటేశ్వరుడికి సేవ చేసేందుకు తమను ప్రభుత్వం నియమించిందని తాము రాజీనామా చేసి సేవల నుంచి తప్పుకోవడం సరికాదన్నారు. అందువల్ల తాను రాజీనామా చేసేది లేదని తెగేసి చెప్పారు.
స్వామివారి సేవ నుంచి తాము స్వయంగా తప్పుకోవడం సెంటిమెంట్ గా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం టీటీడీ పాలకమండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
ఇకపోతే ఇప్పటికే చాలా మంది టీటీడీ పాలకమండలి సభ్యులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పుట్టాకు టీటీడీ చైర్మన్ గా మరో ఏడాది పాటు సమయం ఉంది. అయితే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో టీటీడీ చైర్మన్ గా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇటీవలే వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.