విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారని బీజేపీ మహిళానేత దగ్గుబాటి పురంధీశ్వరి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పాలన అంతా పూర్తిగా అవినీతిమయం అయిపోయిందని విమర్శించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి స్వాగతం పలికేందుకు వచ్చిన ఆమె చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. 

పోలవరం ప్రాజెక్టును తానే కట్టేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం నుంచి రూ.4వేల కోట్లు నిధులు రావాల్సి ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

మరోవైపు  భారత ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ ప్రధానిగా కాకుండా ప్రజాసేవకుడిగా ఉంటున్నారని కితాబిచ్చారు. కేంద్ర పథకాల వల్లనే అందరికీ సంక్షేమం అందుతోందని తెలిపారు. జీఎస్టీని అమలులోకి తీసుకురావడాన్ని ఆమె సమర్థించుకున్నారు. జీఎస్టీ అమలు వల్లనే తక్కువ ధరకే వస్తువులు వస్తున్నాయని చెప్పుకొచ్చారు.