పులివెందుల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 live

సీఎం జగన్‌ కి కంచుకోట అయిన పులివెందుల నియోజకవర్గం నుంచి ఈ సారి కూడా జగన్‌ పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి బిటెక్‌ రవి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం జగన్‌ ఆధిక్యంలో ఉన్నారు.

Pulivendla Assembly elections result 2024 live

కడప జిల్లా అందులోనూ పులివెందుల అంటే వైఎస్ కుటుంబానికి కంచు కోట..  జిల్లా మొత్తం ఆ ఫ్యామిలీకి వీరవిధేయులే. తన తండ్రి రాజారెడ్డి ఇమేజ్‌కు తోడు తన ఛరిష్మాతో కడపను కంచుకోటగా నిర్మించుకున్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన కుటుంబం ఏ పార్టీలో వుంటే.. కడప జనం ఆ పార్టీ వైపే. కాంగ్రెస్, వైసీపీల విషయంలో ఇది అక్షరసత్యమైంది. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ కుటుంబానికి తప్పించి.. మరెవరికీ ఓటు వేయరు అక్కడి జనాలు. మహామహులైన నేతలను పులివెందుల గడ్డ దేశానికి అందించింది. నియోజకవర్గంగా ఏర్పాటైన తర్వాత 1955లో జరిగిన నాటి నుంచి 2010 వరకు పులివెందులలో కాంగ్రెస్ తప్పించి మరో జెండా ఎగరలేదు. దీనికి కారణం వైఎస్ ఫ్యామిలీయే. 

1955లో పెంచికల బసిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి పులివెందుల నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత చావా బాలిరెడ్డి ఇండిపెండెంట్‌గా గెలవగా.. తిరిగి 1967, 72లలో బసిరెడ్డి వరుసగా రెండు సార్లు గెలుపొందారు. ఇక 1978 నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శకం పులివెందులలో మొదలైంది. 1978, 83, 85, 94, 99, 2004, 2009లలో ఆరుసార్లు వైఎస్ఆర్.. 1989, 94లలో వైఎస్ వివేకానంద రెడ్డి..1991లో వైఎస్ పురుషోత్తమ రెడ్డి.. 2010, 2011లలో వైఎస్ విజయమ్మలు పులివెందుల నుంచి విజయం సాధించారు. వైఎస్ అస్తమయం తర్వాత వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీని స్థాపించారు. ఫ్యాన్ గుర్తుపై 2011లో వైఎస్ విజయమ్మ.. 2014, 2019లలో జగన్ విజయం సాధించి పులివెందుల తమకు అడ్డా అని నిరూపించారు. 

రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచినా.. పులివెందులలో మాత్రం ఇప్పటి వరకు పసుపు జెండా రెపరెపలాడలేదు. ఎన్టీఆర్ ప్రభంజనం కానీ.. చంద్రబాబు వ్యూహాలు కానీ పులివెందుల గడ్డపై ఏమాత్రం ప్రభావం చూపకపోవడం గమనార్హం. పులివెందులలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,23,407 కాగా.. సింహాద్రిపురం, లింగాల, తొండూరు, పులివెందుల, వేముల, వేముల, వెంపల్లి, చక్రాయపేట మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలో వున్నాయి. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైసీపీ అభ్యర్ధి వైఎస్ జగన్‌కు 1,31,776 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి సతీష్ కుమార్ రెడ్డికి 42,068 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైఎస్ జగన్ 89,708 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 

పులివెందుల శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024.. 

దాదాపు 40 ఏళ్లుగా టీడీపీకి కొరకరాని కొయ్యగా మారిన పులివెందులలో ఈసారి పసుపు జెండాను రెపరెపలాడించాలని చంద్రబాబు భావించారు. జగన్‌ విషయంలో ప్రస్తుతం ప్రతికూల పరిస్ధితులు వుండటాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని పావులు కదిపారు. టీడీపీ నుంచి  బీటెక్ రవిని జగన్‌పై పోటీ చేశారు. మరి జగన్‌ కి ఈ సారి కూడా తిరుగులేదని తెలుస్తుంది. ఆయన ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios