పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. ఈ క్రమంలోనే అధికారుల తీరుపై మంత్రి విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే, ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనిల మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సత్తెనపల్లి ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ మంత్రి అంబటి రాంబాబు, ఎంపీ కృష్ణదేవరాయలు ప్రారంభించారు. అయితే శిలాఫలకంపై ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పేరు కనిపించలేదు. దీంతో అధికారుల తీరుపై మంత్రి రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మంత్రి విడదల రజని ప్రాతినిథ్యం వహిస్తున్న చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గం నరసరావుపేట పార్లమెంట్ స్థానం పరిధిలో ఉంది. అయితే విడదల రజిని, శ్రీకృష్ణదేవరాయలు వర్గాల మధ్య అధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా ప్రోటోకాల్ వివాదం కూడా ఎంపీ, ఎమ్మెల్యే అధిపత్య పోరులో భాగంగానే జరిగి ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తోంది.
