ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్‌ ఛైర్మన్‌గా విజయసాయిరెడ్డి నియామకం చెల్లదని ఆరోపించారు ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.పిచ్చేశ్వరరావు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒలింపిక్ సంఘం రెండు వర్గాలుగా ఏర్పడి అనేక ఒత్తిళ్లకు గురైందన్నారు.

ఒలింపిక్ సంఘం ఎన్నికలను గుర్తింపు పొందిన సంఘాలతో నిర్వహించామని.. గత ప్రభుత్వంలో గుర్తింపులేని సంఘాలకు సైతం ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కల్పించారని చెప్పారు. ఒలింపిక్ సంఘం సభ్యుడైన పురుషోత్తం 2015లో కొత్త సంఘాన్ని సొసైటీని ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ చేయించారు.

నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌ ఏపీలో ఉండాలి.. కానీ మద్రాస్ చిరునామాతో ఉంది. కోర్టు ఉత్తర్వుల మేరకు పురుషోత్తం రిజిస్ట్రేషన్ చేయించిన సంఘం గుర్తింపు చెల్లదని పిచ్చేశ్వరరావు స్పష్టం చేశారు.

వాస్తవాలు చెప్పకుండా ప్రభుత్వాన్ని గతంలో తప్పుదారి పట్టించారని... ఇప్పుడు కూడా అదే చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నియమ నిబంధనలు పాటించకుండా.. లేని పదవిని సృష్టించి విజయసాయిరెడ్డిని ఛైర్మన్‌గా చేయడం దురదృష్టరమన్నారు. ఈ  నియామకం నియమ నిబంధనల ప్రకారం జరగలేదని.. అందువల్ల ఇది చెల్లదని పిచ్చేశ్వరరావు తెలిపారు.

ఒలింపిక్ సంఘం నియమ నిబంధనలు తెలుసుకోవాల్సిందిగా విజయసాయిరెడ్డి, కృష్ణదాస్‌లను కోరుతున్నామని... మంచి ముఖ్యమంత్రి అనిపించుకోవాలనుకుంటున్న జగన్.. ఒలింపిక్ సంఘంలో జరిగే అవకతవకలను సరిచేయాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు.

ఒలింపిక్ సంఘం ఎన్నికపై న్యాయపరమైన పోరాటం చేస్తామని పిచ్చేశ్వరరావు హెచ్చరించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు..

మొత్తం 8 కమిటీలు, పలు అనుబంధ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సంఘానికి వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఛైర్మన్‌గా, వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్‌‌ను అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే.