కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పలో మంత్రి జయరాం గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. అయితే అక్కడ మంత్రి జయరాంకు నిరసన సెగ తగిలింది.
ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు చేదు అనుభవం ఎదురైంది. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పలో మంత్రి జయరాం గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. అయితే అక్కడ మంత్రి జయరాంకు నిరసన సెగ తగిలింది. కైరుప్పలో తాగునీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మహిళలు, గ్రామస్తులు.. ఖాళీ బిందెలతో మంత్రి జయరాంను చుట్టుముట్టారు. కైరుప్పలో కనీసం డ్రైనేజీ వ్యవస్థ కూడాలేదని గ్రామస్థులు ఆయనను నిలదీశారు. ఈ క్రమంలోనే స్పందించిన మంత్రి.. 20 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
గతంలో కూడా మంత్రి జయరాంకు ఇలాంటి పరిస్థితి ఎదురైన సంగతి తెలిసిందే. మే నెలలో మంత్రి జయరాం జిల్లా అలూరు మండలం హాత్తిబెళగల్ గ్రామంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. అమ్మ ఒడి లేకున్నా సరే.. రోడ్డు వేయించాలని మంత్రిని స్థానికులు నిలదీశారు. తమకు అమ్మఒడి రాలేదని చెప్పిన కొందరు మహిళలు.. అదిపోయిన తమకు రోడ్లు వేయించాలని కోరారు. అంతేకాకుండా మంత్రి ముందు పలు సమస్యలను ప్రస్తావించారు. త్రాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. దీంతో మంత్రి వాటిని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.
