జీవీఎంసీ ఎన్నికల ప్రచారం కోసం విశాఖ చేరుకున్న టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుకు నిరసన సెగ తగిలింది. ఎయిర్‌పోర్ట్ బయట రాజధానిగా విశాఖకు చంద్రబాబు అనుకూలమా, వ్యతిరేకమా అంటూ బ్యానర్లు ప్రదర్శించారు నిరసనకారులు.

ప్రచారానికి ముందు ఉత్తరాంధ్ర ప్రజలకు ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పెందుర్తి , పశ్చిమ, ఉత్తర నియోజకవర్గాల్లో రోడ్‌షోలలో పాల్గొననున్నారు చంద్రబాబు. 

కాగా, నిన్న కర్నూలు పర్యటనలోనూ చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది.. స్థానిక పెద్ద మార్కెట్ దగ్గర టీడీపీ అభ్యర్థుల తరుపున చంద్రబాబు రోడ్ షోలో పాల్గొన్నారు. అయితే ఆ రోడ్ షోకు భారీగా వచ్చిన న్యాయవాదులు చంద్రబాబు మీటింగ్ కు అడ్డుపడ్డారు.

హైకోర్ట్ విషయంపై చంద్రబాబు తీరును లాయర్లు తప్పుబట్టారు. కర్నూలుకు హైకోర్టు రాకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులో హైకోర్టుకు మద్దతు తెలిపిన తరువాత ఆయన ప్రచారం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో న్యాయవాదులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. న్యాయవాదులను అక్కడి నుంచి పోలీసులు పంపించివేసిన తరువాత చంద్రబాబు రోడ్ షో కొనసాగింది