విజయవాడ రైల్వే స్టేషన్‌లో కిడ్నాప్‌కు గురైన బాలిక కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఐదు రోజుల క్రితం మూడేళ్ల బాలికను గుడివాడకు చెందిన ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేశారని పోలీసులు గుర్తించారు. 

విజయవాడ రైల్వే స్టేషన్‌లో కిడ్నాప్‌కు గురైన బాలిక కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఐదు రోజుల క్రితం మూడేళ్ల బాలికను గుడివాడకు చెందిన ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేశారని పోలీసులు గుర్తించారు. బాలికను కిడ్నాప్ చేసి గుంటూరులో పిల్లలు లేని వారికి పెంపకానికి ఇచ్చినట్టుగా నిర్దారించారు. అయితే బాలికను కిడ్నాప్ చేసిన మహిళల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. ప్రకాశం జిల్లాకు చెందిన ఆంజనేయులు విజయవాడకు చెందిన ముస్లిం మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వారికి షఫీదా అనే పాప ఉన్నది. ఆంజనేయలు అక్కడే కూలి పని చేస్తుంటాడు. అతడి భార్య చెత్త కాగితాలు ఏరుతుంటుంది. ఇద్దరూ కలిసి రైల్వేస్టేషన్‌లో ఉంటున్నారు.

విజయవాడ రైల్వే స్టేషన్‌లోని 10వ నంబర్‌ ప్లాట్‌ఫాంపై ఆడుకుంటున్న చిన్నారి వద్దకు గుర్తుతెలియని మహిళ వచ్చింది. పాపకు చాక్లెట్లు ఇప్పించి అనంతరం బాలికను అపహరించుకుపోయింది. ఆ సమయంలో చిన్నారి తల్లి నిద్రిపోతుండగా.. తండ్రి పనిమీద బయటకు వెళ్లాడు. అయితే పాప కనిపించకుండా పోయిన విషయాన్ని గుర్తించిన తల్లి వెంటనే రైల్వే స్టేషన్‌లో గాలించినా ఫలితం లేకుండా పోయింది. అనంతరం రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

అనంతరం పాపను ఎత్తుకెళ్లిన మహిళను గుర్తించేందుకు రైల్వే స్టేషన్‌ ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. షఫీదాను రైల్వేస్టేషన్ బయటకు తీసుకువచ్చి ఆటోలో తీసుకెళ్లినట్లు గుర్తించారు. అనంతరం నెహ్రూ బొమ్మ సెంటర్ ఏరియాలో కొండపైకి తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో చిట్టినగర్, పంజా సెంటర్, వాగు సెంటర్, డెయిరీ ఫ్యాక్టరీ సితార సెంటర్ తదితర ప్రాంతాల్లోనూ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీని నగరంలోని పలు పోలీస్ స్టేషన్లకు పంపించి ఆరా తీస్తున్నారు.