కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య దారుణ హత్య ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. సోములవారి పల్లె పొలాల్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్, జగనన్న కాలనీల్లో ఈ హత్య జరిగింది.

ప్రత్యర్ధులు నందం సుబ్బయ్యను కళ్లల్లో కారం కొట్టి, వేట కొడవళ్లతో దారుణంగా హత్య చేశారు. వారం రోజులుగా నందం సుబ్బయ్య ప్రొద్దుటూరు వైసీపీ నేతలపై, ఎమ్మెల్యేలపై సోషల్  మీడియాలో వరుసగా విమర్శలు, ఆరోపణలు చేశారు.

సోషల్ మీడియాలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదాలు నడిచాయి. ఇంతలో నందం సుబ్బయ్య హత్యకు గురికావడం కలకలం రేపింది. మరికొన్ని గంటల్లో కలెక్టర్ చేతుల మీదుగా, ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్న స్థలంలోనే ఈ హత్య జరిగింది.

మున్సిపల్ అధికారులు సభ ఏర్పాట్లలో ఉండగా ప్రత్యర్థులు రెండు వాహనాల్లో సుబ్బయ్యను వెంబడించి హత్య చేశారు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుబ్బయ్య హత్యకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డే కారణమంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అయితే దీనిని ఆయన ఖండించారు. కుందా రవి సహా మరో నలుగురు వ్యక్తులు తన భర్తను హతమార్చారని సుబ్బయ్య భార్య చెప్పిందన్న విషయాన్ని ఎమ్మెల్యే గుర్తుచేశారు. అత్యాచార యత్నం కేసులో సుబ్బయ్యకు ఆరేళ్లు శిక్ష పడిందని.. ప్రస్తుతం జిల్లా కోర్టులో అప్పీల్ చేసుకుని బయట తిరుగుతున్నాడని రాచమల్లు తెలిపారు.

14 కేసుల్లో నేర చరిత్ర వున్న ముద్దాయి అని, ఈ మధ్య దొంగ సారా కేసులో కూడా పట్టుబడ్డాడని ఎమ్మెల్యే వెల్లడించారు. ఇన్ని కేసుల్లో ఎంతోమంది శత్రువులుంటారని, వారిలో ఎవరో చంపి వుంటారని శివప్రసాద్ రెడ్డి అభిప్రాయపడ్డారు. టీడీపీ నేతలు కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.