నారాయణపై ఆరోపణల వ్యవహారంలో ట్విస్ట్.. పోలీసులకు మరదలి ఫిర్యాదు
టీడీపీ సీనియర్ నేత , మాజీ మంత్రి నారాయణపై ఆయన మరదలు ప్రియ ఫిర్యాదు చేశారు. తాను వీడియోలు విడుదల చేసిన తరువాత నారాయణ నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని ప్రియ ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీ సీనియర్ నేత , మాజీ మంత్రి నారాయణ చిక్కుల్లో పడుతున్నారు. ఆయన తనను వేధిస్తున్నాడంటూ నారాయణ తమ్ముడి భార్య పొంగూరి భార్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఆమె వదిలిన వీడియో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ప్రియ ఏకంగా పోలీసులను ఆశ్రయించారు. నారాయణపై ఆమె ఆదివారం హైదరాబాద్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను వీడియోలు విడుదల చేసిన తరువాత నారాయణ నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని ప్రియ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే తాను పోలీసులను ఆశ్రయించినట్లు ప్రియా పేర్కొన్నారు. అయితే ప్రియా ఫిర్యాదుపై భిన్న కథనాలు వస్తున్నాయి. కొందరు ఆమె ఫిర్యాదు చేసినట్లుగా చెబుతుంటే.. ఇంకొందరేమో పోలీస్ స్టేషన్‌కి రాగానే ఆమెను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్తున్నట్లుగా కథనాలువస్తున్నాయి. అయితే ప్రియా పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నారాయణ తనను వేధిస్తున్నారంటూ ప్రియా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తనపై ఆయన డేగలా కన్నేశాడని.. ఇంట్లో భార్య ఉండగానే తనకు అన్నం పెట్టలేదంటూ తనపై చేయి చేసుకున్నారని ప్రియా ఆరోపించారు. అర్ధరాత్రి సమయంలోనూ తనను టార్చర్ పెట్టేవాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను 29 ఏళ్లు భరించానని.. ఇక భరించే శక్తి తనకు లేదని ప్రియా వెల్లడించింది.