చిత్తూరు జిల్లా పలమనేరు దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందారు.

చిత్తూరు జిల్లా పలమనేరు దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలు అయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి విజయవాడకు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ట్రావెల్స్ బస్సు డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. కాకినాడ జిల్లాలోని పత్తిపాడు మండలం ధర్మవరం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. వివరాలు.. జాతీయ రహదారిపై రాజమండ్రి నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఇసుక లారీ అదుపు తప్పి డివైడర్‌ను దాటి మరో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాల క్యాబిన్‌లలో ఇరుకున్న ఇద్దరు డ్రైవర్‌లు, ఇద్దరు క్లీనర్‌లు సజీవ దహనం అయ్యారు. మంటలు పెద్దఎత్తున చెలరేగడంతో రెండు వాహనాలు కూడా దగ్దమయ్యాయి. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేపట్టారు. ఇసుక లారీకి చెందిన డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.