టిటిడిపి ప్రెసిండెట్ రేవంత్ రెడ్డి పై వేటు పడుతుందా? పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. రేవంత్ పై రెండు రాష్ట్రాల్లోని ప్రముఖ నేతలందరూ ఒక్కసారిగా కత్తికట్టారు.

టిటిడిపి ప్రెసిండెట్ రేవంత్ రెడ్డి పై వేటు పడుతుందా? పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. రేవంత్ పై రెండు రాష్ట్రాల్లోని ప్రముఖ నేతలందరూ ఒక్కసారిగా కత్తికట్టారు. వారం క్రితం తెలంగాణా సిఎం కెసిఆర్ తో సన్నిహితంగా ఉన్న ఏపి నేలు యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ లపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు కలిగించిన సంచలనం అంతాఇంతా కాదు. దాంతో అప్పటి నుండి రేవంత్ కేంద్రంగా రెండు రాష్ట్రాల్లోనూ పలువురు సీనియర్ నేతలు మండిపోతున్నారు.

విదేశీయాత్రలో ఉన్న చంద్రబాబునాయుడుతో కూడా లోకేష్ తో పాటు పలువురు సీనియర్లు మాట్లాడినట్లు సమాచారం. రేవంత్ ను పార్టీ నుండి బయటకు పంపటం ఒక్కటే మార్గంగా చంద్రబాబుపై పలువురు ఒత్తిడి తెస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ పై వేటుకు సంబంధించి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు మాట్లాడిన మాటలే అందుకు ఉదాహరణగా చూపుతున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ గడప తొక్కే అర్హత కూడా రేవంత్ కు లేదంటూ మోత్కుపల్లి ప్రకటించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.

ఇక ప్రస్తుతానికి వస్తే, పార్టీ పరువును బజారుకీడ్చిన రేవంత్ పై కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనంటూ పలువురు నేతలు లోకేష్ పై ఒత్తిడి తెస్తున్నారట. లోకేష్ ద్వారా చంద్రబాబుతో చెప్పించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. పార్టీ పరువును బజారుకీడ్చిన రేవంత్ పై ఇప్పుడు కూడా చర్యలు తీసుకోలేకపోతే నాయకత్వానికి అవమనాంగా భావిస్తున్నారు. చంద్రబాబునే అసమర్ధునిగా జనాలు అనుకునే అవకాశం కూడా ఉందంటున్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రేవంత్ సిద్దపడిన తర్వాతనే టిడిపి నేతలపై రేవంత్ ఆరోపణలు చేస్తున్నారంటూ మొత్కుపల్లి తదితరులు అనుమానిస్తున్నారు. అదే విషయాన్ని పార్టీ నాయకత్వంతో కూడా చెప్పారట. ఎటుతిరిగీ పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్న రేవంత్ పై టిడిపి ముఖ్యులు చర్యలకు దిగినా జరిగో నష్టం ఏమీ ఉండదని కూడా వాదిస్తున్నారు. ఈనెల 26వ తేదీన చంద్రబాబు విదేశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.