రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇవాళ ఏపిలో పర్యటించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్థాపించిన స్వర్ణభారతి ట్రస్ట్ 18వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్రపతి సతీసమేతంగా నెల్లూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డిలు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడుతూ... ట్రస్ట్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసించారు. ఇలా సమాజ సేవ చేయాలనే భావనను ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని రాష్ట్రపతి సూచించారు. 

 ఈ ట్రస్టు ఇంగ్లీయం మీడియం స్కూళ్ల ద్వారా విద్యార్థులకు మంచి విద్య అందిస్తూనే మరోవైపు తెలుగు సంస్కృతిని నేర్పిస్తున్నారని కొనియాడారు. ఇలా మరిన్ని సేవా  కార్యక్రమాలు చేపట్టడం ద్వారా స్వర్ణభారత్‌ ట్రస్ట్ మరింత మంచిపేరును సాధిస్తూ ప్రజలకు చేరువ కావాలని కోరుకుంటున్నట్లు రాష్ట్రపతి తెలిపారు. 

 వెంకయ్య నాయుడు తనకు అత్యంత ఆప్తులని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆయన సొంత జిల్లాకు ఇలా సేవలు చేయడం చూస్తుంటే తనకు చాలా ఆనందంగా వుందన్నారు.  వెంకయ్య నాయుడు తన జీవితంలో ఎన్నో సాధించారని...ఇంకా మరెన్నో సాధించాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు రాష్ట్రపతి తెలిపారు.