కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలోని సీతానగరంలోని శిరోముండనం బాధితుడు ప్రసాద్ రాసిన లేఖకు రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. చిత్ర హింసలు పెట్టారని ప్రసాద్ లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టుగా మారేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ ఈ నెల 10వ తేదీన రాష్ట్రపతికి లేఖ రాశారు.

ఈ లేఖపై రాష్ట్రపతి కార్యాలయం బుధవారం నాడు స్పందించింది. బాధితుడు ప్రసాద్ రాసిన లేఖపై రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. ఏపీ జీఏడీ అసిస్టెంట్ సెక్రటరీ జనార్ధన్ బాబుకు ఈ లేఖను రాష్ట్రపతి కార్యాలయం పంపింది. జనార్ధన్ బాబును కలవాలని బాధితుడు ప్రసాద్ ను రాష్ట్రపతి కార్యాలయం కోరింది.

బాధితుడు ప్రసాద్ కు సహకారం అందించాలని కూడ రాష్ట్రపతి కార్యాలయం ఆదేశించింది. మరో వైపు శిరోముండనానికి సంబంధించిన కేసులో కాల్ రికార్డులు, వీడియో క్లిప్పులను తీసుకొని జీఏడీ అసిస్టెంట్ సెక్రటరీని ప్రసాద్ త్వరలో కలవనున్నారు.

తనకు న్యాయం జరగకపోవడంతో మావోయిస్టుగా మారేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రసాద్ రాష్ట్రపతికి లేఖ రాశాడు. ఈ లేఖపై పోలీసు అధికారి తీవ్రంగా  స్పందించారు. 

ఇసుక లారీలను అడ్డుకొనేందుకే పోలీసులు చిత్ర హింసలు పెట్టిన తనను శిరోముండనం చేశారని ప్రసాద్ ఆరోపించాడు. ప్రసాద్ ఘటన ఏపీ రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారి తీసింది.వైసీపీ నాయకుడి అనుచరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు తనను కొట్టి చిత్రహింసలకు గురి చేయడంతో శిరోముండనం చేశారని ప్రసాద్ ఆరోపించాడు.

వైసీపీ నేతల దాడులు, దౌర్జన్యాలకు ఈ ఘటన నిదర్శనమని టీడీపీ తీవ్రంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే.