Asianet News TeluguAsianet News Telugu

తెలుగు భాష, సాహిత్యం దేశ ప్రజలందరి సుపరిచితమే: విజయవాడలో ద్రౌపది ముర్ముకు పౌర సన్మానం..

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజయవాడ పోరంకిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సన్మానం చేసింది.

President Droupadi Murmu attends a civic reception hosted in her honour by the Andhra Pradesh government
Author
First Published Dec 4, 2022, 1:01 PM IST

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజయవాడ పోరంకిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సన్మానం చేసింది. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతిని సత్కరించిన గవర్నర్ బిశ్వభూషణ్ మెమొంటో అందజేశారు. సీఎం జగన్ రాష్ట్రపతిని సత్కరించి వెంకటేశ్వర స్వామి చిత్రపటం అందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలు కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సత్కరించారు. 

ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. ప్రేమకు భాష అడ్డంకి కాకూడదని.. తాను హిందీలో మాట్లాడుతున్నానని చెప్పారు. సాదర స్వాగతానికి కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు. తన ప్రార్థనను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని నమ్ముతున్నట్టుగా  చెప్పారు. విజయవాడ దుర్గమ్మ ఆశీస్సులు ఉంటాయని విశ్వసిస్తున్నట్టుగా తెలిపారు. బాలజీ పవిత్ర స్థలానికి  రావడం  అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి వంటి నదులు రాష్ట్రాన్ని పునీతం చేశాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నో విశిష్టితలకు నెలవు అని అన్నారు. నాగార్జున కొండ, అమరావతి ఆధ్యాత్మిక కేంద్రాలుగా  విలసిల్లుతున్నాయి

రాష్ట్రానికి చెందిన కూచిపూడి నృత్యం దేశవ్యాప్తంగా ఖ్యాతిని గడించిందని చెప్పారు. తెలుగు భాష, సాహిత్యం దేశ ప్రజలందరి సుపరిచితమేనని అన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు. మహనీయుల గొప్పదనాన్ని కీర్తించారు. మొల్ల రామాయణం పేరుతో మహాకావ్యం రచించారు. గురజాడ రచించిన కన్యాశుల్కం నాటకం ప్రజల మన్నలను పొందిందని తెలిపారు. దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ స్వాతంత్ర్య సంగ్రామంలో ఆమె వంతు పాత్ర పోషించారని అన్నారు. ఆంధ్ర మహిళా సభను స్థాపించారని గుర్తుచేశారు. సరోజినీ నాయుడు ఉప్పు సత్యాగ్రహంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. 

సీఎం జగన్ మాట్లాడుతూ.. దేశ చరిత్రలో తొలిసారి గిరిజన మహిళ రాష్ట్రపతి పదవిని చేపట్టారని అన్నారు. తొలిసారి రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి  ద్రౌపది ముర్మును గౌరవించడం అందరి బాధ్యత అని చెప్పారు. ఆమె అణగారినవర్గాల సంక్షేమానికి కృషి చేశారని తెలిపారు. అర్హతలున్నవారు ఏ స్థాయికైనా చేరగలరనడానికి ద్రౌపది ముర్ము నిదర్శనం అన్నారు. ద్రౌపది ముర్ము సంకల్పంతో ముందుకు సాగిన తీరు మహిళలకు ఆదర్శం అని చెప్పారు. ‘‘మహిళా సాధికరతకు మీరు ఒక ప్రతిబింబం. ప్రతి మహిళ కూడా మీలానే స్వయం సాధికారత సాధించాలని.. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని కాంక్షిస్తూ ఎన్నో పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది. మీలాంటి వ్యక్తుల నుంచి వారు మరింత చైతన్యం పొందుతారని.. ఈ ప్రభుత్వం అందిస్తున్న కార్యక్రమాలు వారి జీవితాల్లో మరిన్ని మార్పులు తీసుకోస్తాయని ప్రగాఢంగా నమ్ముతున్నాను’’ అని జగన్ చెప్పారు. 


గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు ఏపీ తరఫున స్వాగతం పలుకుతున్నట్టుగా  చెప్పారు. ఏపీ ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన రాష్ట్రం అని అన్నారు. తెలగు భాషకు ఎంతో  చారిత్ర పాధాన్యం ఉందన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios