అనుమానాస్పద స్థితిలో ఓ గర్భిణీ ప్రాణాలు కోల్పోయింది. కాగా.. దాదాపు 40 రోజుల తర్వాత ఆమె శవాన్ని మళ్లీ వెలికి తీశారు. భర్తే.. ఆమెను హత్య చేశాడంటూ ఆరోపించడం మొదలుపెట్టారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... యర్రబల్లి గ్రామానికి చెందిన ప్రసాద్‌కు ఐదు సంవత్సరాల క్రితం గుర్రంకొండ మండలం రామాపురానికి చెందిన వసంత(28)తో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. కాగా.. వసంత మరోసారి గర్భం దాల్చింది. ఈ ఏడాది మే 27వ తేదీన ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె చనిపోయే నాటికి 8 నెలల గర్భిణి.

వసంత ఫిట్స్‌తో చనిపోయిందని ప్రసాద్‌, అతని కుటుంబ సభ్యులు చెప్పడంతో వసంత కడుపులో ఉన్న బిడ్డను బయటకు తీసి అంత్యక్రియలు నిర్వహించారు. ఇటీవల మనువరాలు హేమను చూసేందుకు వసంత తల్లిదండ్రులు మంగమ్మ, తిమ్మయ్యలు అల్లుడి ఇంటికి వెళ్లగా ప్రసాద్ వారిని ఇంట్లోకి రానివ్వలేదు. ఈ క్రమంలోనే జరిగిన వాగ్వాదంలో వసంతను తానే చంపినట్లు ప్రసాద్ నోరు జారాడు.

దీంతో మంగమ్మ, తిమ్మయ్య మదనపల్లె గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురిని అల్లుడే చంపి ఫిట్స్‌తో చనిపోయినట్లు అందరినీ నమ్మించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వసంత మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. రిపోర్టు అనంతరం అతనిని అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.