ప్రత్యేకహోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన దీక్షలు, ధర్నాలు, పోరాటాలను చివరికి నినాదాలను సైతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తన రాజకీయ జీవితాన్ని ముఖ్యమంత్రితో పోల్చుకోవడమంటే తనను తాను ఎక్కువగా ఊహించుకున్నట్లు అవుతుందన్నారు.

తన స్థాయి చాలా చిన్నదని పార్టీ లాయల్టీ విషయంలో మాత్రం విద్యార్థి దశ నుంచి ఎన్నో రకాల ఒత్తిడులు, ప్రలోభాలు వచ్చినప్పటికీ తాను కాంగ్రెస్ పార్టీకి విధేయుడినై ఉన్నానన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూసే వరకు విశ్రమించరాదంటూ వైఎస్ ఆదేశించారని రామచంద్రరావు గుర్తు చేశారు.

తన మిత్రుడు, నాయకుడి స్వప్నం నెరవేరే వరకు క్రియాశీలక రాజకీయాల్లో ఉంటానని, ఆ తర్వాత కూడా తన శేషజీవితం కాంగ్రెస్ పార్టీలోనే సాగుతుందని కేవీపీ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఢిల్లీలో చేసిన దీక్ష కంటే మూడేళ్ల ముందే కాంగ్రెస్ పార్టీ చేసిందని ధ్వజమెత్తారు.

మార్చి 13, 2016న ఏపీ పీసీసీ అధ్యక్షుడితో పాటు కాంగ్రెస్ పెద్దలతో కలిసి రాష్ట్రపతికి వినతిపత్రం అందజేశామన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదం మే 23, 2016న విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నినాదమని, టీడీపీ శ్రేణులు చేసిన మట్టి, కుండల ప్రదర్శన మార్చి, 2016లో  ఏపీ పీసీసీ నిర్వహించిందన్నారు.