కర్నూలు: కర్నూలు జిల్లాలో పేర్గాంచిన కోచింగ్ సంస్థలలో ఒకటి ప్రతిభ కోచింగ్ సెంటర్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు కోచింగ్ ఇచ్చే ఈ ప్రతిభ సంస్థ ఆ తర్వాత ఎడ్యుకేషనల్ సొసైటీగా మార్పు చెందింది. ప్రతిభ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో కోచింగ్ సెంటర్లతోపాటు స్కూల్స్, కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, బిఈడీ, డిఈడీ కళాశాలలను స్థాపించారు. 

కర్నూలు జిల్లా కేంద్రంతోపాటు పత్తికొండలోని పలు ప్రాంతాల్లో ప్రతిభ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో అనేక కళాశాలలు వెలిశాయి. అయితే ఈ సంస్థలో ఇప్పుడు లుకలుకలు మెుదలయ్యాయి. తన భర్తను అకారణంగా ప్రతిభ ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి తొలగించారంటూ సీవీఆర్ మోహన్ రెడ్డి భార్య జయమ్మ జిల్లా కలెక్టర్ జి.వీరపాండ్యన్ కు ఫిర్యాదు చేశారు. 

ఇకపోతే ప్రతిభ ఎడ్యుకేషనల్‌ సొసైటీని 18 సంవత్సరాల క్రితం తన భర్త సీవీఆర్ మోహన్ రెడ్డి అరుణాచలం రెడ్డి, షేక్ షంషుద్దీన్ , ప్రసాద్ చంద్రశేఖర్ లు కలిసి ప్రారంభించారని ఆమె కలెక్టర్ కు వివరించింది. 

తన భర్తను సొసైటీకి డైరెక్టర్ గా నియమించడంతో ప్రతిభ కోచింగ్ సెంటర్ రాష్ట్రస్థాయిలో ఉత్తమ సంస్థగా పేర్గాంచేందుకు ఎంతో కృషి చేశారని తెలిపారు. అనంతరం ప్రతిభ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో జిల్లాలో పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, బిఈడీ, డిఈడీ కళాశాలలను సైతం స్థాపించారని తెలిపింది. 

ప్రస్తుతం ప్రతిభ ఎడ్యుకేషనల్ సొసైటీ సంస్థ ఆస్తులు కోట్లాది రూపాయలకు చేరాయని తెలిపారు. ఆ ఆస్తులన్నింటిని అరుణాచలం రెడ్డి గత ఏడాది ఆయన కుటుంబ సభ్యుల పేరిట రాయించుకున్నారని ఆరోపించారు.  

సొసైటీలో భాగస్వామిగా పనిచేస్తున్న తన భర్తను పట్టించుకోకపోగా రూ.80 లక్షలు అప్పులు మోపారని ఆరోపించారు. తమకు  జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తే దాడి చేస్తున్నారని కలెక్టర్ వీరపాండ్యన్ కు ఫిర్యాదు చేశారు. 

తమకు న్యాయం చేయాలని లేని పక్షంలో ఆత్మహత్యే శరణ్యమవుతుందని ఆరోపించారు. జయమ్మ ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ వీరపాండ్యన్ విచారణకు ఆదేశించారు. కర్నూలు ఆర్డీవో వెంకటేష్ ను విచారణాధికారిగా నియమించారు.