కాకినాడ: ప్రత్తిపాడు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిత్వంపై ఓ క్లారిటీ వచ్చేసింది. నియోజకవర్గ ఇంచార్జ్ పర్వత పూర్ణచంద్రప్రసాద్ వైసీపీ అభ్యర్థి అంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉభయగోదావరి జిల్లాల ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డి పరోక్ష సంకేతాలిచ్చారు. 
 
ప్రత్తిపాడు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు బూత్‌స్థాయి కమిటీ సభ్యులు ,కన్వీనర్లతో సమావేశమైన వైవీ సుబ్బారెడ్డి  నియోజకవర్గ ఇన్‌చార్జ్ పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ పార్టీ పటిష్టతకు విశేషంగా కృషి చేస్తున్నారని అభినందించారు. పర్వత నేతృత్వంలోనే ప్రత్తిపాడు ఎన్నికలకు సన్నద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు.
 
ఫిబ్రవరి, లేదా మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు కార్యకర్తలు అంతా కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నవరత్నాల పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అలాగే సీఎం చంద్రబాబు రాష్ట్రానికి చేసిన మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. 

మరోవైపు ప్రత్తిపాడు టిక్కెట్ ఆశిస్తున్న మురళీకృష్ణం రాజు, ఆయన అనుచరులు కానీ వైవీ సుబ్బారెడ్డి సమావేశానికి గైర్హాజరయ్యారు. నియోకజవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన మురళీ కృష్ణం రాజు వర్గీయులు డుమ్మాకొట్టారు. నామమాత్రంగా కేవలం 10 మంది మాత్రమే హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది. పాదయాత్రలో జగన్, పర్వత ప్రసాద్ లతో పాటు హల్ చల్ చేసిన మురళీ కృష్ణంరాజు తనకు టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని తేలడంతో గైర్హాజరయ్యారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.