విధ్వంసాల వెనుక ప్రశాంత్ కిశోర్ వ్యూహం దాగివుందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఒక  ప్రకటనలో  ఆరోపించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే విగ్రహాల విధ్వంసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. 

విధ్వంసాల వెనక రాజకీయ వ్యూహకర్త  ప్రశాంత్ కిషోర్ వ్యూహం దాగివుందన్నారు. విగ్రహాల ధ్వంసాలు జగన్ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం అండ ఉన్నందునే పోలీసులు  నేరస్తులను పట్టుకోవడలో శ్రద్ద చూపడం లేదని విమర్శించారు. 

అంతర్వేదిలో రథాన్ని తగులబెట్టారు, విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి సింహాలు దొంగిలించారు, రామతీర్థంలో రాముని తల నరికారు ఇంకా విగ్రహాలపై వరుసదాడులు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. 

తాజాగా మంగళవారం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మిళిలో ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు విగ్రహాల మఖాలు చెక్కేయడం వెనుక అధికార పార్టీ హస్తం ఉందని ఆరోపించారు. త్వరలో వైఎస్సార్ విగ్రహాలు ధ్వంసం చేసి ఆ నేరాన్ని టిడిపిపై నెట్టేందుకు కట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.

ఇటీవల జగన్ ను కలసిన ప్రశాంత్ కిషోర్ రాష్ట్రంలో అల్లరులు, అశాంతి సృష్టించేందుకు వ్యూహ రచన చేశారని తెలిపారు. జగన్ పై కేసుల విచారణలు, పార్టీ నేతల అవినీతి, అక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు  కుతంత్రాలు పన్నుతున్నారన్నారు.

జగన్ అప్రజాస్వామిక విధానాలు అక్రమాలు, కుట్రలను ప్రజలు గమనించాలని సుధాకర్ రెడ్డి కోరారు.