మహిళా ఎమ్మెల్యేలపై సోషల్ మీడియాలో అభ్యంతరకర రీతిలో పోస్టులు పెట్టడంతో పాటు అసభ్యకర వ్యాఖ్యలు రాసిన వ్యక్తిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. గత నెలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సమయంలో మహిళా ఎమ్మెల్యేల ముందు వరుసలో కూర్చొన్న వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన సైగలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆ ఫోటోను తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్ చేసిన ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం గ్రామానికి చెందిన పునుగుపాటి రమేశ్.. దాని కింద ‘‘ అసెంబ్లీని రెడ్‌లైట్ ఏరియాగా మార్చారు కదరా’’ అనే క్యాప్షన్ జత చేశాడు.

దీనిని గమనించిన ఏపీ అసెంబ్లీ కార్యదర్శి పి. బాలకృష్ణమాచార్యులు గుంటూరు రూరల్ ఎస్పీ జయలక్ష్మీకి ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఫోటో, దాని కింద చేసిన కామెంట్.. ఎస్సీ, ఎస్టీ ఇతర మహిళా ఎమ్మెల్యేలను కించపరిచేలా ఉందంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎస్పీ ఆదేశాలతో నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఐటీ చట్టంతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  పోలీసులు తనను అరెస్ట్ చేయటానికి ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న నిందితుడు అజ్ఞాతంలోకి వెళ్లాడు.

దీంతో అతని కోసం ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, కోయంబత్తూరు, సేలం, చెన్నై, బెంగళూరుల్లో గాలించారు. ఈ క్రమంలో న్యాయవాదితో మాట్లాడటానికి రమేశ్ మంగళవారం గుంటూరు వస్తున్నాడనే సమాచారంతో పోలీసులు రైల్వేస్టేషన్ వద్ద కాపు కాసి అతనిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా.. రమేశ్ గతంలో కొంతకాలం చంద్రశేఖరపురం మండలంలో ఓ తెలుగు దినపత్రికకు విలేకరిగా పనిచేసి, ఆ తర్వాత ఆర్ఎంపీ వైద్యుడిగా మారాడు. మరోవైపు మహిళలను వేధించినా, బ్లాక్‌మెయిల్ చేసినా వారిని కించపరిచేలా పోస్టింగులు పెట్టినా బాధితులు సైబర్ మిత్ర టోల్ ఫ్రీ నంబర్లు 112, 181లను సంప్రదించాలని గుంటూరు పోలీసులు సూచించారు.