Asianet News TeluguAsianet News Telugu

వెలిగొండ ప్రాజెక్ట్‌: కేంద్ర జల్‌శక్తి మంత్రిని కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు

వెలిగొండ ప్రాజెక్టును తక్షణమే అనుమతి పొందిన ప్రాజెక్టుగా కేంద్ర గెజిట్‌లో చేర్పించాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌‌ను కలిశారు టీడీపీ ఎమ్మెల్యేలు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాలో కరువు పరిస్థితి, ప్రాజెక్టు ప్రాధాన్యతను గజేంద్ర సింగ్ షెకావత్‌కు నేతలు వివరించారు
 

prakasam district tdp mlas meets jal shakti minister gajendra singh shekhawat for veligonda project
Author
New Delhi, First Published Aug 31, 2021, 2:35 PM IST

కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌‌తో టీడీపీ నేతలు మంగళవారం భేటీ అయ్యారు. వెలిగొండ ప్రాజెక్టు సమస్యపై కేంద్రమంత్రిని టీడీపీ బృందం కలుసుకుంది. ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టును తక్షణమే అనుమతి పొందిన ప్రాజెక్టుగా కేంద్ర గెజిట్‌లో చేర్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రకాశం జిల్లాలో కరువు పరిస్థితి, ప్రాజెక్టు ప్రాధాన్యతను గజేంద్ర సింగ్ షెకావత్‌కు నేతలు వివరించారు. టీడీపీ నేతల విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. జల్‌శక్తి మంత్రిని కలిసిన వారిలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నారు. 

కాగా, ఈ ఆదివారం వెలిగొండ ప్రాజెక్ట్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అంతకు రెండు రోజుల కిందట ఆ ప్రాజెక్ట్‌కు నిధులు ఇవ్వొద్దంటూ కేంద్రానికి లేఖ రాసింది తెలంగాణ. ఈ క్రమంలో వెలిగొండకు అనుమతులు లేవనడం సరికాదని, ఆ ఫిర్యాదుపై పునరాలోచన చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు టీడీపీ ఎమ్మెల్యేలు. ఏపీ ప్రభుత్వ తీరు వల్లే ఈ ప్రాజెక్ట్‌కు అనుమతి లేదని గెజిట్‌లో పెట్టారని, కానీ 2014 విభజన చట్టంలో కల్వకుర్తి, నెట్టెంపాడుతో సహా వెలిగొండ ప్రాజెక్ట్‌ను కూడా పెట్టారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios