ప్రకాశం జిల్లా దర్శిలో బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్టుగా కలెక్టర్ దినేష్ కుమార్ చెప్పారు.
ఒంగోలు: ప్రకాశం జిల్లా దర్శిలో బస్సు ప్రమాదంపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసినట్టుగా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రకటించారు. ప్రకాశం జిల్లా దర్శిలో మంగళవారంనాడు తెల్లవారుజామున పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు నాగార్జున సాగర్ కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో 18 మంది గాయపడ్డారు. ఈ బస్సు పొదిలి నుండి కాకినాడకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ఉన్నారు.
ప్రమాదం జరిగిన స్థలాన్ని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఇవాళ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులను కారణాలు అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జి ఇరుకుగా ఉందా అనే విషయమై కూడ కలెక్టర్ ఆరా తీశారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు కమిటీని ఏర్పాటు చేస్తామని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. రవాణాశాఖ, ఆర్టీసీ, రోడ్లు,భవనాల శాఖకు చెందిన అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు.
ప్రమాదం జరిగిన స్థలంలో బ్రిడ్జి అంత ఇరుకుగా లేదని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. రెండు వాహనాలు ఒకే సమయంలో ఈ బ్రిడ్జి మీదుగా ప్రయాణం చేసే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండకపోవచ్చని ఆయన చెప్పారు. బస్సు ప్రమాదానికి కారణం విచారణలో తేలుతుందన్నారు. మరో వైపు ప్రమాదం జరిగిన సమయంలో బస్సు ఎంత వేగంతో వెళ్తుందని విచారణలో తేలుందని కలెక్టర్ తెలిపారు.
also read:ప్రకాశం జిల్లాలో సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు, ఏడుగురు మృతి
ఈ ప్రమాదంలో ఒక్కరికి మాత్రమే భీమా వర్తిస్తుందన్నారు.ఈ ప్రమాదంలో మరణించిన వారికి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టుగా కలెక్టర్ దినేష్ కుమార్ వివరించారు. ఈ ప్రమాదంలో గాయపడిన 18 మందిని పలు ఆసుపత్రుల్లో చేర్పించినట్టుగా కలెక్టర్ తెలిపారు. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ బస్సు ప్రమాదంలో అజీస్, అబ్దుల్ హని, ముల్లా జానీ బేగం, ముల్లా నూర్జహన్, షేక్ రమీజ్, షేక్ షాబీనా, షేక్ హీనా మృతి చెందారు. మరో 18 మంది గాయపడ్డారు.
