అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ప్రజావేదిక కూల్చివేత పనులు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి కూల్చివేత పనులు ప్రారంభించిన అధికారులు ఇప్పటి వరకు  దాదాపు 60శాతం కూల్చివేశారు.  

మంగళవారం అర్థరాత్రి ప్రజావేదిక చుట్టూ నిర్మించిన ప్రహరీగోడను జేసీబీ సాయంతో కూల్చివేశారు. అలాగే ప్రజావేదిక పక్కనే నిర్మించిన ప్యాంట్రీ, క్యాంటీన్, మరుగుదొడ్లను కూల్చివేశారు. అనంతరం ప్రజావేదిక కూల్చివేత పనులు ప్రారంభించారు. 

ప్రజావేదిక ప్రవేశం ద్వారం వద్ద మెట్లు, ఎలివేషన్ ను పూర్తిగా ధ్వంసం చేశారు. అనంతరం యుద్ధ ప్రాతిపదికను భవనం కూల్చివేత పనులు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం 10 గంటలకు పూర్తిగా నేలమట్టం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇకపోతే ప్రజావేదిక కూల్చివేత పనులు జరుగుతున్న సమయంలో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అటుగా వెళ్లారు. ప్రజావేదిక కూల్చివేత పనులను కాన్వాయ్ లో ఉండి వీక్షించారు. అనంతరం సమీపంలోని ఇంటి నుంచి కూడా ప్రజావేదిక కూల్చివేతను గమనించారు. కళ్లెదుటే ప్రజావేదిక కూల్చివేతను చూసిన చంద్రబాబు ఒకింత ఆవేదనకు గురైనట్లు తెలుస్తోంది.