అమరావతి: ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. ప్రజావేదికను కూల్చేందుకు పలుగు, పార, సుత్తెలతో కూలీలు లోపలికి వెళ్లారు. మరోవైపు జేసీబీలు సైతం ప్రజావేదికను కూల్చే పనిలో పడ్డాయి.  

ఇప్పటికే ప్రజావేదికలోని క్యాంటీన్ జేసీబీల సాయంతో తొలగించారు. అలాగే కలెక్టర్లు, ఎస్పీల సదస్సుకోసం ఏర్పాటు చేసిన టెంట్లను కూల్చివేశారు. తెల్లవారు జామున ప్రజావేదిక మెుత్తం కూల్చివేతకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. సీఆర్డీఏ కమిషనర్ దగ్గర ఉండి ప్రక్రియను పరిశీలిస్తున్నారు.

మరోవైపు ప్రజావేదిక కూల్చివేస్తున్న నేపథ్యంలో ఫర్నీచర్ అంతటిని తరలించారు సీఆర్డీఏ అధికారులు. ప్రజావేదిక సామాగ్రి, ఫర్నీచర్, మైక్ సెట్, టేబుల్స్ తోపాటు ఎలక్ట్రికల్ సామాగ్రిని సైతం అధికారులు తరలించారు. 

మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి వస్తున్న తరుణంలో ప్రజావేదిక వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ప్రజావేదికతోపాటు కరకట్టను తమ ఆధీనంలో తీసుకున్నారు. ప్రజావేదిక పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది.