కుక్కలాగా అమ్ముడుపోయాడు, చంద్రబాబు నుంచి రూ.1500 ముట్టాయి: పవన్ కల్యాణ్ పై కెఎ పాల్
టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మద్దతు ప్రకటించిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మీద ప్రజాశాంతి అధ్యక్షుడు కెఎ పాల్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నుంచి పవన్ కల్యాణ్ కు ముడుపులు ముట్టాయని ఆరోపించారు.

విశాఖపట్నం: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మీద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నుంచి పవన్ కల్యాణ్ కు రూ. 1,500 కోట్లు ముట్టాయని ఆయన ఆరోపించారు. విశాఖపట్నంలోని అశీలమెట్టలోని తన ఫంక్షన్ హాల్లో ఆయన ఆదివారంనాడు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
చంద్రబాబుకు పవన్ కల్యాణ్ కుక్క మాదిరిగా అమ్ముడుపోయాడని ఆయన వ్యాఖ్యానించారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్లు అని ఆయన అన్నారు. అందుకే పవన్ కల్యాణ్ వెంట కాపులు లేరని ఆయన అభిప్రాయపడ్డారు. కాపులను అమ్ముకోవడానికి చిరంజీవి, పవన్ కల్యాణ్ ప్రజారాజ్యం పార్టీని, జనసేన పార్టీని పెట్టారని ఆయన అన్నారు.
జనసేనలో 2019లో లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్ ఇద్దరే చేరారని, ఎన్నికలు ముగియగానే వారిద్దరు కూడా బయటకు వచ్చారని ఆయన గుర్తు చేశారు. ప్రజాశాంతి ఉపాధ్యక్షుడు డాక్టర్ కుమార్, మమతారెడ్డి కూడా ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో అరెస్టయి చంద్రబాబు రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్టును పవన్ కల్యాణ్ తప్పుపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. తాము టిడిపితో పొత్తు పెట్టుకుంటున్నట్లు చంద్రబాబును రాజమండ్రి జైలులో కలిసిన తర్వాత పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే కెఎ పాల్ పవన్ కల్యాణ్ మీద వ్యాఖ్యలు చేశారు.