హైదరాబాద్: అధికార ప్రతిపక్ష పార్టీలపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌లపై విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు, జగన్‌ లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. 

జాతీయ రాజకీయాల్లో చక్రంతిప్పుతానంటున్న చంద్రబాబు మంగళవారం ఢిల్లీ వెళ్తే ఒక్కనేత కూడా కలవలేదని చెప్పుకొచ్చారు. అదే తెలుగుదేశం పార్టీ అంతానికి నాంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ విషయం టీడీపీకి కూడా తెలుసునన్నారు. 

రాబోయే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కవని కేఏ పాల్ జోస్యం చెప్పారు. దేవుడికి చంద్రబాబుపై కోపం వచ్చిందని, అనాథలకు, వితంతువులకు ఆయన విరుధ్ధంగా వ్యవహరిస్తున్నారని అందువల్లే దేవుడు ఆగ్రహంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

 గురువునైన తనపైనే కుట్రలు చేశారని, ఇక చంద్రబాబును దేవుడు కూడా క్షమించరని పాల్ హెచ్చరించారు. మరోవైపు గత ఏడాది నవంబర్ లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గల్లంతు అయిపోతుందని తాను చెప్పానని అదే జరిగిందని అలాగే ఏపీలో సీఎం కాలేడన్నది కూడా వాస్తవమేనన్నారు. తనను ముఖ్యమంత్రిగా చూడాలని ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్నారని కేఏ పాల్ స్పష్టం చేశారు.