Asianet News TeluguAsianet News Telugu

తెనాలిలో పవర్ పంచ్... ఓటరు చెంపదెబ్బే వైసీపీకి శాపమైందా?

గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేసిన తప్పు ఆయనకే రివర్స్ అయింది. పోలింగ్ కేంద్రంలో ఓటరుపై చేయి చేసుకోవడం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనే తెనాలిలో వైసీపీకి పెను శాపమైందా అంటే...?

Power Punch in Tenali... Voter's slap is a curse for YCP? GVR
Author
First Published Jun 6, 2024, 1:11 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ తుడిచిపెట్టుకుపోవడానికి ఎన్నో కారణాలున్నా... తెనాలిలో వాటన్నిటితో పాటు ఒకటే కనిపిస్తోంది. అది మే 13న ఎన్నికల పోలింగ్‌ రోజు సాక్షాత్తూ ఎమ్మెల్యేనే ఓటరుపై చేయి చేసుకోవడం. ఆ తర్వాత అసంకల్పిత చర్యగా ఓటరు తిరిగి ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించడం. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతటా సంచలనం సృష్టించింది. దీనిపై ఎన్నికల సంఘం కూడా సీరియస్‌ అయింది. సదరు ఎమ్మెల్యేపై చర్యలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. 

కర్ణుడి చావుకి అనేక కారణాలన్నట్లు.. వైసీపీ పరాభవానికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకుల ఓవర్ యాక్షన్‌ ప్రజలకు విసుగు తెప్పించింది. హుందాగా ప్రవర్తించాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం కూడా ఓటర్ల ఆగ్రహానికి కారణమైందని విశ్లేషకులు చెబుతున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని, అనిల్ కుమార్‌ యాదవ్‌ లాంటి నాయకులు నోటికొచ్చినట్లు ప్రతిపక్ష నేతలను దూషించడం కూడా వైసీపీ పతనానికి కారణమైందంటారు.

అసలు ఏం జరిగిందంటే...? 

గుంటూరు జిల్లాలోని ప్రముఖమైన నియోజకవర్గాల్లో తెనాలి ఒకటి. ఈ ప్రాంతం ఎంతో చరిత్ర కలిగింది. ఆంధ్రా ప్యారిస్‌ అని కూడా ఈ ప్రాంతాన్ని పిలుస్తారు. రాజకీయంగా ఎంతో చైతన్యం కలిగిన ప్రాంతం తెనాలి. ఈసారి ఎన్నికల్లో ఏం జరిగిందంటే... మే 13న పోలింగ్‌ రోజు వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ఓటరుపై చేయి చేసుకోవడం దుమారం రేపింది. తెనాలిలోని ఐతనగర్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటేసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే శివకుమార్‌ క్యూ లైన్లో వెళ్లకుండా నేరుగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన ఓ ఓటరు అభ్యంతరం చెప్పడంతో ఎమ్మెల్యే రెచ్చిపోయారు. ఏ మాత్రం ఆలోచించకుండా క్యూలో నిల్చొని ఉన్న ఓటరు దగ్గరికి వెళ్లి చెంపదెబ్బ కొట్టారు. ఏం జరిగిందో తెలుసుకొనేలోపే ఓటరు కూడా లాగి ఒక్కటిచ్చాడు. ఎమ్మెల్యే శివకుమార్‌ చెంప చెళ్లుమనిపించాడు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు అతణ్ని చితకబాదారు. ఈ ఘటన చుట్టుపక్కల ఉన్న ఓటర్లను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.


ఈ ఘటనపై బాధిత ఓటరు గొట్టిముక్కల సుధాకర్ పోలీసులను ఆశ్రయించారు. అనేక మలుపుల తర్వాత ఈసీ చర్యలకు ఉపక్రమించింది. ఎమ్మెల్యే శివకుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఓటింగ్ అయ్యే వరకు మే 13న గృహ నిర్భందం చేయాలని ఆదేశాలిచ్చింది. 

ఈ ఘటనే తెనాలిలో వైసీపీ కొంప ముంచిందని కూడా చెప్పవచ్చు. ఎందుకు వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌కు వచ్చిన ఓట్లు 75,849. ఇక తెనాలిలో విజయం సాధించిన జనసన సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు 1,23,961 ఓట్లు దక్కాయి. శివకుమార్‌పై నాదెండ్ల మనోహర్‌ 48,112 మెజారిటీ సాధించారు.


Tenali assembly elections result 2024:  తెనాలి రాజకీయాల్లో ఆలపాటి కుటుంబానిదే  చాలాకాలం పైచేయిగా నిలిచింది. స్వాతంత్ర్య సమరయోధుడు ఆలపాటి వెంకటరామయ్య వరుసగా 1952 నుండి 1965 వరకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అనంతరం ఆయన కూతురు దొడ్డపనేని ఇందిర మూడుసార్లు, మనవరాలు గోగినేని ఉమ ఓసారి ఎమ్మెల్యేగా పనిచేసారు. ఈ ముగ్గురు వేరువేరు పార్టీల నుండి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు.  ఇక నాదెండ్ల, అన్నాబత్తుని కుటుంబాలు కూడా తెనాలి రాజకీయాలను శాసిస్తున్నారు. ఈ మూడు కుటుంబాలకు చెందినవారే ఇప్పటివరకు తెనాలి ఎమ్మెల్యేలుగా పనిచేసారు. 

తెనాలి నియోజకవర్గ పరిధిలోని మండలాలు :

1. తెనాలి 

2. కొల్లిపర 

తెనాలి అసెంబ్లీ ఓటర్లు : 

తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,63,286 (2019 ఎన్నికల ప్రకారం).  వీరిలో పురుషులు 1,27,775, మహిళలు 1,35,465 వున్నారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నవారు 2,03,175 

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన పురుషులు - 103959 

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన మహిళలు 99,213

2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గంలో మొత్తం 2,05,768 మంది ఓటేశారు. అంటే 78 శాతం పోలింగ్ నమోదయ్యింది. 

వైసిపి - అన్నాబత్తుని శివకుమార్ - 94,495 (45 శాతం) ‌-  గెలుపు (17,649 వేల ఓట్ల మెజారిటీతో)

టిడిపి - ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ - 76,846 (37 శాతం) - ఓటమి 

జనసేన - నాదెండ్ల మనోహర్ - 29,905 ‌(14 శాతం) - మూడో స్థానం 

  
తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాలు 2014 : 

ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన తొలి ఎన్నికల్లో టిడిపి హవా కొనసాగింది. దీంతో 2014 ఎన్నికల్లో తెనాలి టిడిపి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 93,524 (48 శాతం) ఓట్లు సాధించి విజయం సాధించాడు. వైసిపి అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ కు 74,459 (38 శాతం) ఓట్లు వచ్చాయి. ఇక్కడ వైసిపిపై టిడిపి మెజారిటీ 19,065. తెనాలి నుండి విజయం సాధించిన ఆలపాటికి టిడిపి కేబినెట్ లో మంత్రి పదవి దక్కింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios